ఉట్నూర్ రూరల్, నవంబర్ 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్ సొసైటీ క్రీడా పోటీల్లో గిరిజన క్రీడాకారులు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లాల్టెకిడిలో ప్రభుత్వ గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో ఈ నెల 12,13,14,15వ తేదీన 6వ జోనల్ స్థాయి పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో జోన్ -1 ఆదిలాబాద్, మెదక్, జోన్ -2 కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, జోన్-3 నల్గొండ, ఖమ్మం, జోన్- 4 మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి 1200 మంది క్రీడాకారులు, ఎస్కార్ట్ సిబ్బంది, వ్యాయామ, క్రీడా ఉపాధ్యాయుల పాల్గొన్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హైజంప్, లాంగ్‌జంప్, అథ్లెటిక్స్, కుస్తీ, హ్యాండ్‌బాల్, చెస్, ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న 240 మంది క్రీడాకారులకు ఈ నెల 27వ తేదీ వరకు కళాశాల ప్రిన్సిపాల్ రాంమెహన్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాలకు చెందిన 30 మంది పీఈటీ, పీడీ, కోచ్‌లు వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అనంతరం 28వ తేదీన ప్రారంభమయ్యే ఇంటర్ సొసైటీ క్రీడా పోటీలకు సిద్ధమవుతారు.
క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ
ఈ క్రీడల్లో గిరిజన గురుకుల విద్యార్థుల పతకాలు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవాలి. అందుకోసం ఈ నెల 16వ తేదీ నుంచి జోనల్ స్థాయి క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. 6వ జోనల్ స్థాయి క్రీడల్లో రాణించిన విద్యార్థులకు శిక్షణతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నాం. గిరిజన గురుకులాల పేరు రాష్ట్ర స్థాయిలో నిలిపేందుకు సిబ్బంది శిక్షణ ఇస్తున్నారు.
-గిరిజన గురుకులాల ఉమ్మడి ఆదిలాబాద్
జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ గంగాధర్