ఆదిలాబాద్, నవంబర్ 16 ( నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా రైతు లు పంటలు సాగు చేయాలంటే భయపడే వారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాయి. రైతుబంధు, రైతుబీమా, సకాలంలో విత్తనాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయానికి 24 గంటల సాగునీరు, పంటల కొనుగోళ్ల లాంటివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో భూములు ఉన్నా వ్యవసాయం చేయని రైతులు పంటలు సాగుచేస్తూ ఉపాధిని మెరుగుపర్చుకుంటున్నారు.
ఉన్న త విద్యనభ్యసించి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు సైతం తమ సొంత గ్రామాలకు తిరిగివచ్చి పంటలు సాగు చేస్తున్నారు. రైతులకు సర్కారు ఇస్తున్న ప్రోత్సాహం కారణంగా జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. గతేడాది వానకాలంలో 5,56, 098 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేయగా, ఈ ఏడాది వానకాలంలో పంటలు విస్తీర్ణం 5,72, 832 ఎకరాలకు పెరిగింది. జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి సాగు చేస్తుండడంతో ఈ పంట రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నది. పత్తికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.6380 ఉండగా ప్రైవేట్ వ్యాపారులు సోమవారం రూ.9010 చెల్లించి కొనుగోలు చేశారు. జిల్లాలో ఈ ఏడాది జూలైలో కురిసిన వర్షాల కారణంగా రైతులు సోయాబీన్ పంట నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సోయాబీన్ పంట కొనుగోళ్లు చివరిదశకు చేరుకున్నాయి. సోయాబీన్, పత్తి పంటను తీసిన రైతులు యాసంగి సాగుకు సిద్ధమవుతున్నారు.
యాసంగి 1,45,662 ఎకరాల్లో సాగు
జిల్లాలో యాసంగి సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు తయారు చేశారు. 1,45,662 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేయనున్నారు. గతేడాది ఈ సీజన్లో జిల్లా లో 1,25,705 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. గతేడాదిలో పోల్చితే ఈసారి 19,957 ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. ఎక్కువగా శనగ పంట 90 వేల ఎకరాలు, జొన్న 35 వేల ఎకరాలు, గోధుమ 5 వేల ఎకరాలు, మక్క 6 వేల ఎకరాలు, వేరు శనగ 2500 ఎకరాల్లో వేయనున్నారు. వీటితో పాటు ఇతర పంటలు కూడా రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
జిల్లాలో రెండు సీజన్లలో రైతు లు తమ పంటలను అమ్మకునేందుకు ప్రభు త్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది.శనగ, జొన్న పంటలను ప్రభుత్వం ఏటా మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నది. దీంతో ఈ పంటలు సాగు చేసిన రైతులకు విక్రయ సమయంలో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో జొన్న, గోధుమల వినియోగం ఎక్కువగా ఉంటుంది. గ్రామాలు, పట్టణాల్లో సైతం ప్రజలు రైతుల నుంచి ఈ పంటలు కొనుగోలు చేస్తారు. జిల్లాలో యాసంగి పంటల సాగుకు అవసరమైన ఎరువుల కోసం అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ఈ ఏడాది వానకాలంలో కురిసిన భారీ వర్షాల కారణఁగా ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. చెరువులు, వ్యవసాయ బోర్లు, బావుల్లోకి పుష్కలంగా నీరు చేరింది. దీంతో యాసంగి పంటలకు అసరమయ్యే సాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. ప్రభుత్వం అందిస్తున్న సాయంతో ఈ ఏడాది యాసంగి పంటలు ఆశాజనకంగా ఉంటాయని రైతులు అంటున్నారు.
యాసంగి సాగు విస్తీర్ణం పెరిగింది
జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం యాసంగి సాగు విస్తీర్ణం పెరిగింది. వానకాలం సోయా పంటను సాగు చేసిన రైతులు యాసంగి పంట వేయడానికి సిద్ధమవుతున్నారు. పంటలు సాగుపై రైతులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. సాగునీటికి ఇబ్బందులు లేకపోగా రైతులకు అవసరమైన ఎరువులను పంపిణీ చేస్తాం.
పుల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్