ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 12 : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ శనివారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్), టీఆర్ఎస్వీ, సీపీఐ, సీపీఎం, ఏఐఎస్ఎఫ్, ఐఎఫ్టీయూ నాయకులు నిరసనలు తెలిపారు. మోది గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. దేశంలో కోటి ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని టీఆర్ఎస్వీ నాయకుడు శివకుమార్ ఆరోపించారు.
జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉమ్మడి జిల్లా విభజన తర్వాత మరో మూడు నవోదయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించినా బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీపీఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఎదుట రహదారిపై మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మత తత్వాన్ని రెచ్చగొడుతూ పాలన సాగిస్తున్న మోదీ.. తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ దేశ సంపదను పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడ నాయకులు ముడుపు నళిని రెడ్డి, అరుణ్ కుమార్, కుంటాల రాములు, దేవిదాస్ పాల్గొన్నారు. అలాగే సుందరయ్య భవన్ వద్ద సీపీఎం సీనియర్ నాయకులు లంకా రాఘవులు, నాయకులు కిరణ్, ఆశన్న, సురేందర్, మంజుల, సోమేశ్ ప్ల కార్డులతో నిరసన తెలిపారు. మోదీ సర్కారు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తూ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని దుయ్యబట్టారు. అలాగే ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యం లో నల్ల కండువాలతో నిరసన చేపట్టారు. అధ్యక్ష, కార్యదర్శులు సుమేర్ పాషా, గేడం కేశవ్ మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. విద్యా వ్యవస్థకు కావాల్సిన బడ్జెట్ కేటయించడం లేదని ఆరోపించారు.
పీఎం మోదీ పర్యటన నేపథ్యంలో సీపీఎం ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, పార్టీ సీనియర్ నాయకుడు బండి దత్తాత్రిని ఆదిలాబాద్ రూరల్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ తమ ఎనిమిదేండ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పనీ చేయకపోగా, ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. కార్పొరేట్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నదని ఎద్దేవా చేశారు.
నిర్మల్ టౌన్, నవంబర్ 12 : నిర్మల్ జిల్లా కేంద్రంలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ నాయకులు విలాస్, రాజన్న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్నదన్నారు. ఎప్పుడో ప్రారంభించిన ఎరువుల కర్మాగారాన్ని ఇప్పడు ప్రారంభించేందుకు రావడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్ఎన్ రెడ్డి, ఉపలి, శంకర్, రమేశ్, మోహినొద్దీన్, తదితరులు పాల్గొన్నారు. అలాగే సీఐటీయూ, సీపీఎం నాయకులు పట్టణంలోని గాంధీపార్కులో గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి, బెలూన్లతో నిరసన తెలిపారు. ఇక్కడ నాయకులు అరవింద్, రతన్, అబ్జల్, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.