భైంసా, నవంబర్ 5 : మొక్కలు జీవ వైవిధ్యానికి, వాతావరణ సమతుల్యతకు తోడ్పడుతాయని బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ్ కుమార్ అన్నారు. భైంసా పట్టణంలోని గోపాల్ రావు పటే ల్ డిగ్రీ కళాశాలలో శనివారం ‘అటవీ సంపద, వైవిధ్యత, వినియోగం, సంరక్షణ’ అంశంపై జాతీ య సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కళాశాలలో 650 మంది విద్యార్థులతో పాటు డాక్టరేట్ చేసిన ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నలుగురు డాక్టరేట్ చేస్తున్న అధ్యాపకులు ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. ట్రిపుల్ ఐటీలో బోధించే ప్రొఫెసర్లతో కళాశాలలో అవగాహన ఒప్పందం కింద (ఎంవోయూ) ‘మెమోరండఫ్ అండర్స్టాండింగ్’ కింద అవగాహన ఒప్పందం కుదుర్చుకోవచ్చన్నారు.
భవిష్యత్‌లో నిర్వహించే సెమినార్‌కు తనవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు సెమినార్లో విద్యార్థులకు సైతం భాగస్వామ్యం కల్పించాలన్నారు. అనంతరం వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు సదాశివయ్య మాట్లాడుతూ.. మానవ మనుగడకు జీవులే ఆధారమన్నారు. అవి లేకపోతే ప్రత్యక్షం గా, పరోక్షంగా మానవుడు అంతరించిపోతాడని చెప్పారు. చీమ నుంచి అతిపెద్ద జంతువు వరకు మనిషితో అవినాభావ సంబంధం ఉంటుందన్నారు. పిచ్చి మొక్కలు మొదలుకొని అనేక రకాల మొక్కలతో మానవుడు సహజీవనం చేయాలని, అప్పుడే మనుగడ సాధ్యమవుతుందని చెప్పారు. జీవ వైవిధ్యంపై మనిషి వైఖరి మారాలని సూచించారు. పర్యావరణంలో పాములు కూడా భాగమేనని, పర్యావరణ సమతుల్యతలో ప్రముఖ పాత్ర వహిస్తాయన్నారు.
అనంతరం మొక్కల వర్గీకరణ శాస్త్రవేత్త బాల్యపాలం దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. మొక్కలు, జీవుల గురించి తెలుసుకునే వాళ్లు తగ్గిపోయారన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ బేగ్ మీర్జా మాట్లాడుతూ.. వాతావరణ సమతుల్యతకు మొక్కలే జీవవైవిధ్యానికి ఎంతో తోడ్పాటునందిస్తాయన్నారు. ఇప్పటికే 34 మొక్కలకు కొత్తపేర్లు కనిపెట్టామని, కొత్తవాటిని గుర్తించడం, పేరు పెట్టడం వంటివి చేస్తున్నామన్నారు. ముందుగా 123 పరిశోధనల పత్రాలతో కూడిన సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, కన్వీనర్ వెల్మల మధు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంత సుధాకర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.