కడెం, నవంబర్ 5: ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు భవిత కేంద్రాలు తోడ్పాటునందిస్తున్నాయి. ఈ కేంద్రాలు చిన్నారులకు సమీకృత విద్యనందిస్తున్నాయి. సాధారణ విద్యార్థులతో కలిసి చదివేలా ఈ కేంద్రాలు ఉపయోగపడుతున్నాయి. అనువంశిక లక్షణాలతో జన్మించడం, ఆహార లోపంతో తల్లిగర్భంలోనే సరైన ఎదుగుదల లేకపోవడం, శారీరక, మానసిక, వినికిడి లోపం, అంధత్వంతో పుట్టిన వారికి భవిత కేంద్రాలు చేయూతనందిస్తున్నాయి. వీరు సాధారణ పిల్లలతో కలిసి విద్యాభాసం కొనసాగించడంతో పాటు, జనజీవన స్రవంతిలో ఎదిగేందుకు ఈ భవిత కేంద్రాలు ఎంతో ఉపయోపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2012లో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలోని 13 మండలాల్లో భవిత కేంద్రాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం విలీన విద్యా వనరుల భవనాలు (భవిత కేంద్రాలు) నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు, ఖానాపూర్, భైంసా, ముథోల్ మండలాల్లో ఉన్నాయి. మిగిలిన తోమ్మిది మండలాల్లో పాఠశాలల్లో కేంద్రాల నిర్వహణ ఐఈఆర్పీ పరిధిలో కొనసాగుతున్నాయి. వినికిడి లోపం, మానసిక వైకల్యం గల పిల్లల కోసం ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 13 కేంద్రాల్లో 1659 మంది పిల్లలుండగా, 24 మంది సిబ్బంది పని చేస్తున్నారు. నూతన మండలాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం పాత మండలాల ఐఈఆర్పీలు ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు.
ఉపకార వేతనాలు, అలవెన్స్‌లు
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకార వేతనాలూ ఇస్తున్నారు.అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ చార్జీలు, ఎస్కార్ట్ అలవెన్స్ ఇస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రభుత్వం తరపున ఈ ఏడాదికి రూ.1,39,750 విడుదలయ్యాయి. జిల్లా వ్యాప్తం గా గత ఏడాది 9, 10వ తరగతి విద్యార్థులకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా 95 మందికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేయగా, 77 మందికి రూ. 9 వేల నుంచి 14 వేల వరకు ఉపకార వేతనాలు వచ్చాయి. గత ఏడాది ఉపకార వేతనాలు రూ.6.30 లక్షలు విడుదలయ్యాయి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 107 మందికి దరఖాస్తులు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్‌లు 155 మందికి నెలకు రూ. 350 చొప్పున, ఎస్కార్ట్ అలవెన్స్‌లు 374 మందికి నెలకు రూ. 350 చొప్పున అమ్మాయిలకు ైస్టెఫండ్ 273 మందికి నెలకు రూ. 200 చొప్పున, రీడర్ అలవెన్స్ ఆరుగురికి రూ. 60 చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేక దృష్టి
18 ఏళ్ల లోపు బడి బయటి పిల్లలు, మానసిక, శారీరక వైకల్యం, వినికిడి, దృష్టిలోపం ఉన్న చిన్నారులను ఇంటింటా సర్వే ద్వారా గుర్తించి వారి స్థాయిని బట్టి ఆయా కేంద్రాలకు పంపిస్తారు. దీనితో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణ సైతం అందించి, పాక్షిక వైకల్యం ఉన్న పిల్లలను గుర్తిస్తారు. వారిని కూడా సమానస్థాయి పిల్లలతో కలిపి సమ్మిళిత విద్యనందిస్తున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి ఈ కేంద్రాల్లో వారికి ఫిజియోథెరపీతో పాటు, రాయ డం, చదవడం, గుర్తించగలడం, గణితంపై ప్రాథమిక స్థాయిలో అవగాహన కల్పించి పాఠశాలల్లో చేర్పిస్తారు. మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు పాఠశాలతో పాటు, ఇంటి వద్దే వైద్యం, విద్యనందించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్రాల్లో శిక్షణ కోసం వచ్చే విద్యార్థులకు రవాణా భత్యం, ఎస్కార్ట్ అలవెన్స్ అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1659 మంది చిన్నారులు ఉన్నారు. ఇందులో ఐదేళ్ల లోపు వారు 120 మంది, ఐఈఆర్సీ పరిధిలో 172 మంది, దివ్యాంగులు 974 మంది, ఇంటి దగ్గర ఉండి భవిత కేంద్రాల ద్వారా విద్యనభ్యసిస్తున్నవారు 95 మంది, బడిలో చేరని పిల్లలు 298 మంది ఉన్నారు. వారి స్థాయిని బట్టి ఉచితంగా వినికిడి యంత్రాలు, వీల్ చైర్స్, ట్రై సైకిళ్లు, సంక కర్రలు, క్యాలీబర్స్, నడక యంత్రాలు, మూవిం గ్ స్టిక్స్, దృష్టిలోపం ఉన్న వారికి అచ్చు యం త్రాలు, టేప్ రికార్డులు, చదువుకునేందుకు పరికరాలను సమకూర్చుతున్నారు. మొదట 10 రకాల సేవలందించగా, ప్రస్తుతం వీటిని 20కి పెంచారు.
కొత్త మండలాల్లో త్వరలో..
నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం 13 మండలాల్లో భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్యాబోధనతో పాటు ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ ఇస్తున్నాం. ఐదుగురు ఫిజియోథెరపీలు, నలుగురు స్పీచ్థెరపీతో పాటు 24 మంది సిబ్బందితో శిక్షణ కొనసాగుతుంది. నూతనంగా ఏర్పాటైన మండలాల్లో సైతం త్వరలోనే సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం ఆ మండలాలకు ఉమ్మడి మండలాల్లోనే శిక్షణ కొనసాగిస్తున్నాం. ప్రతి శుక్రవారం ఒక్కో మండలంలో ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం.
ప్రవీణ్ కుమార్, జిల్లా విలీన విద్యా సమన్వయ కర్త
ఎన్ఎస్పీ ద్వారా స్కాలర్షిప్
మాది నిర్మల్ జిల్లా భైంసా మండలం ఎగ్గాం గ్రామం. నేను మాటేగాం జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న. నాకు 9వ తరగతిలో నేషనల్ పోర్టల్ ద్వారా రూ. 11 వేల ఉపకార వేతనం వచ్చింది. ఈ డబ్బులు నా చదువు, వైద్య ఖర్చుల కోసం ఉపయోగపడుతున్నాయి. మాలాంటి వాళ్లకు చాలా ప్రయోజనకరం.
కే ఉమారాణి, 10వ తరగతి, మాటేగాం స్కూల్