నిర్మల్ జిల్లాలో మరోసారి డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి యంత్రాంగం శ్రీకారం చుట్టబోతున్నది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పర్యవేక్షణలో అర్హుల ఎంపికకు పకడ్బందీ సర్వే చేస్తున్నది. బంగల్పేట్ శివారులోని మహాలక్ష్మి వాడలో 444, నాగనాయిపేటలో 1016, ఖానాపూర్ పట్టణంలో 400, భైంసా పట్టణంలో 200 ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, దసరా నాడు అందించేందుకు కసరత్తు చేస్తున్నది. పండుగ కానుకగా డబుల్ ధమాకా దక్కనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
నిర్మల్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో మరోసారి డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పర్యవేక్షణలో దసరా పండుగ నాడు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ఇండ్లను అర్హులకు అందించాలని నిర్ణయించారు. ఈ విషయమై కలెక్టర్ ఇప్పటికే సంబంధిత అధికారులతో రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నారు.
నిర్మల్ జిల్లా బంగల్పేట్ శివారులోని మహాలక్ష్మి వాడలోని 444, నాగనాయిపేటలోని 1016తో పాటు ఖానాపూర్ పట్టణంలోని 400, భైంసా పట్టణంలోని 200 ఇండ్లు పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ, మున్సిపల్, సహకార శాఖ అధికారులు ఇచ్చిన జాబితా ప్రకారం ఇంటింటా సర్వే చేపడుతున్నారు. చుట్టు పక్కల వారిని కూడా విచారిస్తున్నారు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో మొత్తం 10,775 మంది ఇండ్లు లేని పేదలు దరఖాస్తులు చేసుకోగా, ఇందులో 5,248 మందిని అర్హులుగా గుర్తించారు. అయితే, ఇక్కడ నిర్మించిన ఇండ్ల సంఖ్య తక్కువగా ఉన్నందున మొదట పూర్తిగా ఇండ్లు లేని నిరుపేదలను ఎంపిక చేస్తున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 2,511 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయ్యాయి. నిర్మల్ అర్బన్ పరిధిలో 1460, ఖానాపూర్‌లో 400, భైంసాలో 200 ఇండ్లతో పాటు తిమ్మాపూర్‌లో 16, కడ్తాల్‌లో 50, గంజాల్‌లో40, పాక్పట్లలో 50 ఇండ్లు పూర్తయ్యాయి. ఇప్పటికే నిర్మల్ మండలం ఎల్లపెల్లి గ్రామంలో 69, చిట్యాలలో 71, రత్నాపూర్ కాండ్లీలో 50, లక్ష్మణచాంద మండలం కూచన్పెల్లిలో 30, బోరిగాంలో 25, సారంగాపూర్ మండలం డ్యాంగాపూర్‌లో 50 ఇండ్లను పంపిణీ చేశారు. కాగా , జిల్లా వ్యాప్తంగా మరో 2029 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి.
పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఇటీవల రూ. 7.70 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యంగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. ఈ నిధులతో డబుల్ బెడ్రూం ఇండ్లలో మరుగుదొడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుదీకరణ, తాగునీటి సదుపాయం, అంతర్గత రోడ్లు మొదలగు పనులు చేపట్టనున్నారు. వచ్చే దసరా పండుగ నాటికి ఈ పనులన్నీ పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇండ్లు పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించేందుకు అర్హులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామని డోర్ టూ డోర్ సర్వే చేయిస్తున్నామని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు.
పైసా ఖర్చు లేకుండా నిరుపేదలందరికీ గూడు కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయించాం. ప్రస్తుతం నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో పూర్తయిన ఇండ్లను దసరా నాటికి పంపిణీ చేయాలని భావిస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నది. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదు. ఎవరైనా ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగితే నేరుగా ఫోన్ చేసి చెప్పండి.
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి