బాసర, జూలై 30 : విద్యార్థుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, విద్యార్థుల బీమాకు సంబంధించి ఇద్దరు ప్రొఫెసర్లతో కమిటీ వేసినట్లు ఇన్చార్జీ వీసీ వెంకటరమణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ట్రిపుల్‌ఐటీలో గల అన్ని విభాగాల సీఆర్(క్లాస్ రిప్రజెంటేటివ్స్)లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఆర్లు వీసీ దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై అక్కడున్న అధికారులకు పలు సూచనలు చేసి సమస్యలను పరిష్కరించాలని వీసీ ఆదేశాలు జారీ చేశారు.
యూనివర్సిటీలో క్రీడా వసతులు మెరుగు పరిచేందుకు, ఇంజినీరింగ్ విద్యలో సంస్కరణలు తీసుకువడానికి అనుభవజ్ఞులు, యూనివర్సిటీ ప్రొఫెస్లతో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఆయా కమిటీల నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఆగస్టు 6న 9 కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటామని, తద్వారా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. సీఆర్లతో ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ట్రిపుల్ఐటీ ప్రతిష్టను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ విభాగంలో ప్రొఫెసర్ కృష్ణయ్య విద్యార్థులకు పలు వర్క్‌షాప్‌లను నిర్వహించారు. జేఎన్టీయూ హైదరాబాద్ ట్రిపుల్ఈ విభాగానికి చెందిన జీఎన్ శ్రీనివాస్ పలు సూచనలు చేశారు. విద్యార్థుల ప్రవేశ జాబితా ఆగస్టు రెండో వారంలో వెల్లడించనున్నట్లు ఇన్చార్జీ వీసీ తెలిపారు. 33,105 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు.
ఎన్వీఐడీఐఏ కంపెనీలో రూ.47లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించిన పూర్వవిద్యార్థి దేవులపల్లి నవీన్ కుమార్‌ను సన్మానించారు. మరో నలుగురు విద్యార్థులు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సాధించారని, మిగతా విద్యార్థులు సైతం వనరులను సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని సూచించారు.