బోథ్, జూలై 26: ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బోథ్ మండలంలోని ధన్నూర్(బీ), అందూర్, రఘునాథ్‌పూర్, మందబొగూడ, సొనాల, సాంగ్వి, కోటా(కే), పెద్దగూడ, పట్నాపూర్ గ్రామాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. ధన్నూర్(బీ) వాగు మరోసారి వంతెనపై నుంచి పారడంతో ఆరు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.
గ్రామంతో పాటు నాగాపూర్, జైనూర్పల్లె, దర్భతండా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అందూర్ సమీపంలోని వాగు మూలంగా గ్రామంతో పాటు నాగాపూర్ గిరిజనులు అవస్థలు పడ్డారు. సొనాల వాగు ఉధృతితో కోటా(కే), మహదుపటేల్పల్లె వాసులు బయటకు రాలేకపోయారు. మర్లపెల్లి ప్రాంత ప్రజలు పట్నాపూర్ వంతెన సర్వీసు రోడ్డు మూలంగా అవస్థలు పడ్డారు. మరోవైపు వాగుల పరీవాహక ప్రాంతాల్లోని పంటలకు వరద ముంచెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాలతో పాటు అన్ని భూముల్లో వర్షపు నీరు నిలిచి పోవడంతో పత్తి, సోయా, కంది తదితర పంటల మొక్కలు నీరు బట్టి దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన చెందుతున్నారు.
బోథ్, జూలై 26 : బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం పరవళ్లు తొక్కుతున్నది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షంతో పెద్దవాగులో వచ్చిన వరద ప్రవాహంతో ఎగిసి పడింది. జలపాతం మధ్యలోని బండరాళ్లు కనిపించని విధంగా నీరు ఎత్తిపోసింది. జలపాతం అందాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు.
నేరడిగొండ, జూలై 26 : మండలంలో కుంటాల జలపాతానికి వెళ్లే మార్గంలో సావర్గాం వాగు ఉధృతంగా ప్రవహించడంతో అటుగా వైపు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. రాజురావాగు వంతెనపై నుంచి వరదపారడంతో గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భీంపూర్, జూలై 26 : మండలంలో పెన్‌గంగ, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కరంజి(టీ)- టేకిడిరాంపూర్ మధ్య ఉన్న గుట్ట దిగువ వాగు ప్రవాహంతో కొజ్జన్గూడ, గుబ్‌డి, టేకిడిరాంపూర్, పిప్పర్షేండ్య గ్రామాల ప్రజలు పనుల నిమిత్తం కరంజి(టీ) గ్రామానికి రాలేని పరిస్థితి నెలకొంది. గుబ్‌డి, అంతర్గాం, గోముత్రి, వడూర్ , గొల్లగఢ్, తాంసి(కే) పెన్‌గంగ రేవులగుండా నాటు పడవలు వేయడం లేదు . ఆదిలాబాద్- కరంజి(టీ) మార్గంలో ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెన్‌గంగ పరీవాహక ప్రాంతాల్లో పంటలు జలమయమయ్యాయి.
బేల, జూలై 26 : మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్నది. దహిగాం, దేవుజీగూడ, మణియార్‌పూర్ గ్రామాల సమీపంలో వంతెనపై నుంచి వర్షపునీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెన్‌గంగ పరివాహక ప్రాంతమైన సాంగిడి గ్రామంలో నీటి తీవ్రతతో ఎస్ఐ కృష్ణకుమార్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. అంతర్రాష్ట్ర రహదారి ఇరువైపులా సాగు చేస్తున్న పత్తి, సోయా పంటలు నీట మునిగాయి.
తలమడుగు, జూలై 26 : మండల కేంద్రంలోని వంతెనపై 5 గంటల పాటు నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సుంకిడి, డోర్లి, సాయిలింగి గ్రామాల్లో లోలెవల్ వంతెనలపై వరద ప్రవహించడంతో విద్యార్థులు, గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. వరద ఉధృతిని తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. రుయ్యాడిలో వాగు ఉధృతితో పొలాల్లోకి నీరు చేరింది. టీఎస్డీడీసీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి వెంట టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
తాంసి, జూలై 26 : మండలంలోని వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టులోకి మంగళవారం భారీగా వరద వచ్చి చేరడంతో నీటి మట్టం పెరిగింది. ఇరిగేషన్ అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. ప్రాజెక్టు నీటిమట్టం 277.50 మీటర్లు కాగా ప్రస్తుతం 276.60 మీటర్టకు చేరింది. సగటున ప్రాజెక్టులోకి 9229 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అంతే మొత్తంలో కిందికి వదులుతున్నారు. సంబంధిత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని ప్రాజెక్టు ఏఈ నరేశ్ తెలిపారు.
జైనథ్, జూలై 26: మండలంలోని సాత్నాల ప్రాజెక్టులోకి వరద భారీగా వచ్చి చేరుతుంది. మంగళవారం సంబంధిత ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. 4600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 286.50 మీటర్లు కాగా ప్రస్తుతం 284.70 మీటర్లు ఉంది.