ఎదులాపురం, ఏప్రిల్ 21: కొవిడ్ మహమ్మారి సమయంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును సీఎం కేసీఆర్ ఆపలేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లోని పుత్లీబౌలి ఉర్దూ ఘర్ షాదీఖానాలో ఎమ్మెల్యే, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి ముస్లింలకు గురువారం రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న మాట్లాడారు.
పేద ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్ ప్యాకెట్లు అందిస్తున్నదని తెలిపారు. ఆదిలాబాద్‌కు 3వేలు, బోథ్‌కు 1500 ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇఫ్తార్ కోసం ఆదిలాబాద్‌కు రూ.6లక్షలు, బోథ్‌కు రూ.3లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. సమష్టి కృషితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసం బీజేపీ దేశంలో అల్లర్లకు పాల్పడుతున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిధులతోనే రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. కొవిడ్ కారణంగా రెండేళ్లు రంజాన్ వేడుకలను అధికారికంగా నిర్వహించలేదని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ సంవత్సరం గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీతో పాటు ఇప్తార్ కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ప్రజాప్రతినిధులు యూనుస్ అక్బానీ, సాజిదొద్దీన్, మైనార్టీ శాఖ సిబ్బంది కలీం, హసిబ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 21: స్వచ్ఛ సర్వేక్షణ్కు పట్టణ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే జోగు రామన్న కోరారు. గురువారం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పర్యటించి స్వచ్ఛ సర్వేక్షణ్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. వీధి వ్యాపారులతో మాట్లాడారు. రంజాన్ సందర్భంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో మున్సిపాలిటీ నుంచి ప్రత్యేకంగా చెత్తబుట్టలు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. వాటిలోనే చెత్తాచెదారం వేయాలని సూచించారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా మూత్రశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు యూనుస్ అక్బానీ ఉన్నారు.