సిరికొండ, జూన్ 20 : వానకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాలు కురుస్తుండడంతో విత్తనాలు వేయడానికి దుక్కి దున్ని చేన్లు సిద్ధం చేస్తున్నారు. మండలంలోని రైతులు విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. మార్కెట్లో పలు రకాల కంపెనీల విత్తనాలు, పురుగుల మందుల ప్రచారం జోరందుకుంది. ప్రైవేట్ కంపెనీలు ఆకర్షణీయమైన ప్రకటనలు, ప్రచార ఆర్భాటలతో రైతులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా రైతులు విత్తనాల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని, లైసెన్స్ కలిగిన విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
పలు రకాల కంపెనీల యాజమన్యాలు డీలర్లకు రకరకాల ప్యాకేజీలు, విదేశీ, స్వదేశీటూర్లు ఆఫర్ చేస్తున్నారు. రైతులకు ఎక్కువ మోతుదులో సదురు కంపెనీల విత్తనాలు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ, నాసిరకం విత్తనాలు మార్కెట్కు వస్తున్నాయి. రైతులు ఈ కంపెనీల వలలో పడి నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవడం పరిపాటిగా మారింది. సిరికొండ మండలంలో 5,013 మంది రైతులుండగా, మండల వ్యాప్తంగా 20,232 ఎకరాల్లో పత్తి, సోయా, కంది, చిరుధాన్యాలు సాగు చేస్తారని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
రైతులు అధిక దిగుబడులు రావాలని ఆశతో విత్తనాలతో పాటు ఎరువులు మోతాదుకు మించి వినియోగిస్తారు. ఇలా చేయడంతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పురుగుల మందుల విషయంలోనూ మోతుదుకు మించవద్దని వ్యసాయాధికారులు సూచిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు వాడి అధిక దిగుబడి సాధించాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే జిల్లా వ్యవసాయాధికారి 7288894000 సెల్నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు.
రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు కట్టబెడితే నిర్వాహకులపై పీడీ యాక్టు నమోదు చేసి, షాపు సీజ్ చేస్తాం. ఇప్పటికే గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. రైతులు వ్యసాయాధికారుల సలహాలతోనే విత్తనాలు, ఎరువులు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఒకే రకం పంట వేయడంతో దిగుబడి తగ్గుతుంది. నేల సారవంతం కోల్పోతుంది.
-జాదవ్ కైలాస్, మండల వ్యవసాయాధికారి, సిరికొండ