ఎదులాపురం, జూన్ 20 : తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారుల ను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థాని క టీటీడీసీ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణకు హరితహారంపై క్షేత్రస్థాయి సిబ్బందికి సన్నాహక సమావేశం నిర్వహించారు. ముందుగా గత హరితహారంలో నాటిన మొక్కలు, అందులో చనిపోయిన వి, పల్లె, బృహత్ ప్రకృతి వనాలు, గ్రామాల అంతర్గత రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు తదితరవి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అ టవీ శాఖ అధికారి రాజశేఖర్ వివరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, అందుకు అవసరమైన మొక్కలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. నర్సరీల నుం చి గ్రామాలు, మండలాల వారీగా కావాల్సిన మొ క్కలను సమకూర్చుకోవాలని తెలిపారు. ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
గ్రామాలు, రహదారుల వెంట పచ్చదనం పెంపొందేలా మల్టీలేయర్, అవెన్యూ, బ్లాక్, కమ్యూనిటీ ప్లాంటేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామంలోని ముఖ్య కూడళ్లు, శ్మశాన వాటికల్లోని ఖాళీ ప్రదేశాలను గుర్తించి విరివిగా మొక్కలు నాటాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఉట్నూర్ ఎఫ్‌డీవో రాహుల్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, జడ్పీ సీఈవో గణపతి, ఏపీడీ రవీందర్ రాథోడ్, అటవీ శాఖ రేంజ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, టీఏలు పాల్గొన్నారు.
ఉద్యోగాల కోసం ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. విద్యుత్, ధరణి, ఉపాధి, పింఛన్లు, దళిత బంధు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు తదితర సమస్యలపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. ఉద్యోగాల కోసం ఎవరూ ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించవద్దని తెలిపారు.
రెండు పడక గదుల ఇళ్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామసభలు నిర్వహించి అర్హులకు కేటాయిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆర్డీవో రమేశ్ రాథోడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.