భైంసా, జూన్ 20 : ఈ పోటీ ప్రపంచంలో జన జీవనం ఉరుకులు, పరుగుల మయమైపోయింది. సమయానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఒత్తిళ్లు, ట్రాఫిక్ రద్దీతో అసహనం సరేసరి. వెంటాడుతున్న కాలుష్య భూతంతో దరిచేరే రోగాలు, ఏది చేద్దామన్నా ఇబ్బందే. వీటన్నింటి నుంచి కాసింత ఉపశమనానికి యోగానే చక్కని ఔషధం అంటూ నిపుణులు శాస్త్రీయంగా నిరూపించారు. యేటా జూన్ 21న అంతర్జాతీయ యోగా
అన్ని రోగాలకు యోగానే మందు. చిన్న చిన్న రోగాలకు సైతం పాశ్చాత్య వైద్యం వైపు పరుగులు తీసే ఈ రోజుల్లోనే యోగా అన్ని రోగాలకు సంజీవనిలా మారింది. యోగా అభ్యసనం, మనిషికి ఆరోగ్యం, శక్తి, తేజస్సు, చురుకుదనాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. యోగాలో అంతర్భాగమైన సరళ విన్యాసాన్ని అనుసరిస్తే ధ్యేయ రక్షణ సిద్ధించడంతో పాటు మనో వికాసం వృద్ధి చెందుతుందంటున్నారు నిపుణులు. క్రమం తప్పకుండా యోగా చేస్తే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు దీర్ఘకాలిక రోగాలు సైతం నయమవుతాయని పేర్కొంటున్నారు.
యోగా అభ్యసనం ఎప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉండడం మంచి ఫలితాలనిస్తుంది. ఎంచుకున్న స్థలం ఎత్తు పళ్లాలు లేకుండా సమాంతరంగా ఉండాలి. స్థిరంగా ఒక భంగిమలో కూర్చోవాలి. మంచి వాతావరణం, వెలుతురు, గాలి వచ్చేలా ఉన్న స్థలాన్ని ఎంచుకోవాలి. శక్తికి మించిన వ్యాయామాలు చేయకుండా కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవాలి.
యోగా మనలోని బద్ధకాన్ని తొలగిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది. ప్రతిరోజూ యోగా చేస్తున్నా మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్యం, ఏకాగ్రత, మంచి వ్యక్తిత్వ నిర్మాణం, శాంతియుత స్వభావంతో ఉండగలుగుతాం.
– శ్రీనివాస్