ఇచ్చోడ, జూన్ 16 : గ్రామాల్లో పారిశుధ్యంపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని డీఆర్డీవో కిషన్ సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా గురువారం మండలంలోని అడెగామ(కే), గుబ్బా గ్రామాల్లో ఆయన పర్యటించారు. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన నర్సరీ, క్రీడా ప్రాంగణం కోసం స్థలాన్ని ఆయన పరిశీలించారు. మురుగు కాల్వలు శుభ్రం చేయాలని ఆదేశించారు. వానకాలం నేపథ్యంలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంప్‌యార్డుకు తరలించాలన్నారు. ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి అవసరమైన మొక్కలు సమకూర్చాలని సూచించారు. అనంతరం గుబ్బా గ్రామంలో ఉపాధి హామీ గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ అనితాసుభాష్రెడ్డి, తహసీల్దార్ రాథోడ్ మోహన్‌సింగ్, ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీవో కొమ్ము రమేశ్, ఏపీవో నరేందర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
నార్నూర్, జూన్ 16 : పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని డీపీవో శ్రీనివాస్ పేర్కొన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతిలో భాగంగా గాదిగూడలో బుధవారం రాత్రి పల్లె నిద్ర చేపట్టారు. గురువారం ఉదయం గాదిగూడ, దాబా(బీ), దాబా(కే), సావ్రి, లోకారి(కే) గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వీధులను పరిశీలించారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సలహా, సూచనలు పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు ఇచ్చారు. సేంద్రియ ఎరువుతో పంచాయతీకి నిధులు సమకూర్చుకోవాలని సూచించారు. హరితహారంలో ప్రణాళికతో మొక్కలు నాటేలా చూడాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్, ఎంపీడీవో రామేశ్వర్, ఎంపీవో షేక్ ఖలీమ్హైమద్, సర్పంచ్‌లు మెస్రం జైవంత్‌రావ్, మెస్రం దేవ్‌రావ్, ఆనంద్‌రావ్, కొడప మోతుబాయి, పంచాయతీ కార్యదర్శులు రవికిరణ్, మెస్రం విజయ్‌కుమార్, సుభాష్, సునీల్‌కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 16 : భూగర్భ జలాలు పెంచడానికి ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నామని సర్పంచ్ మెస్రం రేణుకానాగ్‌నాథ్ అన్నారు. మండలంలోని కేస్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కేస్లాగూడ(జి)లో చేతిపంపు వద్ద చేపడుతున్న ఇంకుడు గుంత నిర్మాణ పనులను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మహ్మద్ మోతేశాం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు, చేతి పంపుల వద్ద వృథాగా వెళ్తున్న నీరు ఇంకుడు గుంతల్లో వెళ్లే విధంగా నిర్మాణం చేస్తున్నామన్నారు.
తలమడుగు, జూన్ 16 : మండలంలోని కజ్జర్ల, దేవాపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రాథోడ్ రాజేశ్వర్ పరిశీలించారు. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మురుగు కాల్వలను పరిశీలించారు. ప్రతి గ్రామ పంచాయతీలో తెలంగాణ క్రీడా మైదానాలకు స్థలాలు గుర్తించి పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట సర్పంచ్‌లు ఫాతిమా బేగం, వెంకటమ్మ, ఎంపీడీవో రమాకాంత్, ఎంపీవో దిలీప్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
నార్నూర్, జూన్ 16 : మండలంలోని భీంపూర్ గ్రామంలో చేపడుతున్న పల్లె ప్రగతి పనులను ప్రత్యేకాధికారి, తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను పర్యవేక్షించారు. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం అందించాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట సర్పంచ్ రాథోడ్ విష్ణు, పంచాయతీ కార్యదర్శి రాజు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.