తానూర్, జూన్ 11 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మండలంలోని భోసి గ్రామంలో కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో శనివారం అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలు, పెద్దలు వ్యాయామం చేసేందుకు ప్రభుత్వం గ్రామాల్లో క్రీడామైదానాల ఏర్పాటుకు రూపకల్పన చేసిందన్నారు. గ్రామాల్లో అంటువ్యాధులు రాకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు.
పల్లెప్రగతిలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వీరి వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, సర్పంచ్ శివరాత్రే ఆనంద్, జిల్లా పౌర సంబంధాల అధికారి తిరుమల, తహసీల్దార్ వెంకటరమణ, మండలాభివృద్ధి అధికారి గోపాలకృష్ణరెడ్డి, ఎంపీవో మోహన్‌సింగ్, ఏపీవో గంగాధర్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, మాజీ జట్పీటీసీ ఉత్తం బాలేరావ్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
కుభీర్, జూన్ 11 : మండలంలోని మాలేగాం, నిగ్వ గ్రామాల్లో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సందర్శించారు. ప్రకృతి వనంలో చెట్లు, పచ్చని గడ్డిని చూసి నివ్వెరపోయారు. సుమారు ఎకరంలో ఆరువేల మొక్కలు నాటామని, ప్రస్తుతం చెట్లుగా ఎదిగి ప్రజలకు సేదతీరేందుకు దోహదపడుతుండడం చూసి సర్పంచ్ గుంచెటి లక్ష్మీరాజు, కార్యదర్శి పాముల కిరణ్‌ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకుసాగాలని సూచించారు.
నిగ్వ పల్లె ప్రకృతి వనం గ్రామానికి కొత్తదనాన్ని తెచ్చిపెట్టిందని అన్నారు. రానున్న వానకాలంలో ప్రజలు రోగాల బారినపడకుండా గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రకృతి వనం సంరక్షణకు రూ. 50వేలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు మాలేగాంలో క్రీడా ప్రాంగణం, ఎరువుల షె డ్డు, పల్లె ప్రకృతి వనం, మన ఊరు-మన బడి కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల మరమ్మతు పనులను ప రిశీలించారు. సర్పంచ్ మహిపాల్‌రెడ్డి కృషిని కొనియాడారు. శాలువాతో సత్కరించి, అభినందించారు. ఆ యా గ్రామాల్లో కలెక్టర్ మొక్కలు నాటి నీరు పోశారు. తహసీల్దార్ విశ్వంబర్, ఎంపీడీవో రమేశ్, ఏపీవో హరిలాల్, సెక్రటరీలు ఆకాశ్, కిరణ్, ఎంపీటీసీ దొంతుల దేవిదాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.