కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం జిల్లాలో వ్యవసాయరంగ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 2463.44 కోట్లతో జిల్లా రుణ ప్ర ణాళికను అధికారులు సిద్ధం చేశారు. పంట రుణాల కోసం రూ. 1492.55 కోట్లు, వ్యవసాయ టర్మ్లోన్స్ కోసం రూ. 528.99 కోట్లు అందజేయనున్నారు. కా గా ఇందులో ప్రాధాన్యతా రంగాలకు 2331.04 కోట్లు, అప్రాధాన్యత రంగాలకు 132.40 రుణాలను కేటాయించారు.
జిల్లా రుణ ప్రణాళికల్లో పంటరుణాలతో పాటు అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యత కల్పించారు. జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్లో సుమారు 4లక్షల 58 వేల ఎకరాల్లో పంటలు వేయనున్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లలో రైతులకు, వ్యవసాయ రంగాలకు ప్రాధానత కల్పించారు. గతేడాది రూ. 2218.59 కోట్లతో ప్రణాళికలు అమలు చేయగా, ఈ ఏడాది రూ. 2463.44 కోట్లు కేటాయించారు. మహిళా సంఘాలకు రూ. 200 కోట్ల రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు అమలు చేయనున్నారు. దీంతో పాటు చిన్న పరిశ్రమల ఏర్పాటకు అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నారు. కొత్తగా ఏర్పడిన మహిళా సంఘాలకు అర్హత మేరకు రుణాలను అందించానున్నారు.
జిల్లాలో గతేడాది రూ. 1318.87 కోట్లు పంట రుణాలుగా అందించారు. వ్యవసాయ టర్మ్లోన్స్ ద్వారా రూ. 507.73 కోట్లు, అగ్రికల్చర్ క్రెడిట్ ద్వారా రూ. 1826.60 కోట్లు, ప్రాధాన్యాత రంగాలకు రూ. 2098.29 కోట్లు, అప్రాధాన్యత రంగాలకు రూ. 120.30 కోట్లు అందించారు. కాగా, ఈ ఏడాది ప్రతి రంగంలోనూ నిధులను పెంచారు. వ్యవసాయ పంటరుణాలు 11.64 శాతం, వ్యవసాయ టర్మ్లోన్స్ 4.02 శాతం, అగ్రికల్చర్ క్రెడిట్లోన్స్ 9.64 శాతం, ప్రాధాన్యాత రంగాలకు 9.98 శాతం, అప్రాధాన్యత రంగాలకు 9.14 శాతం రుణాలను పెంచారు.
వానకాలం సీజన్ పంటలను వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే భూములను సిద్ధం చేసుకున్నారు. దీంతో సకాలంలో పంటరుణాలు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు బ్యాంకు అధికారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. రుణాలను ఇవ్వడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, డిమాండ్ మేరకు రుణాలు ఇవ్వాలని అదేశించారు. పంటల ఆధారంగా రైతులకు పంటరుణాలను అందించనున్నారు.