మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శనివారం రెండో రోజూ ‘పల్లె, పట్టణ ప్రగతి’జోరుగా సాగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవగాహన ర్యాలీలు తీశారు. మురుగుకాలువలను శుభ్రం చేయించి.. పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. జైపూర్ మండలం టేకుమట్లలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొని పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.
నస్పూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ మండలం కౌటగూడలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావుతో కలిసి పాల్గొని వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. జైనూర్ మండలం జంగాంలో కలెక్టర్ రాహుల్‌రాజ్ శుక్రవారం రాత్రి పల్లె నిద్ర చేశారు.
మంచిర్యాల జూన్ 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు శనివారం రెండో రోజూ కొనసాగాయి. ఉదయం నుంచే అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లె, పట్టణ బాట పట్టారు. అభివృద్ధి, పారిశుధ్య పనులు చేపట్టారు. చెన్నూర్ నియోజకవర్గంలో జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు. రూ.23లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.10లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. పల్లె, పట్నం పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పాల్గొన్నారు. పట్టణ ప్రగతితో కలిగే లాభాలను వివరించారు. మంచిర్యాలలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య ఉన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలోని 2, 16వ వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. ఆయన వెంట చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ ఉన్నారు. పట్ణణ ప్రగతి మూడో విడుతలో జరిగిన అభివృద్ధిని వివరించారు. పట్ణణంలోని మురుగు కాల్వలను శుభ్రం చేయించారు. జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో డీఆర్డీవో శేషాద్రి, డీపీవో నారాయణ రావ్ తదితరులు పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పలు వాడల్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి కలియతిరిగారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అధికారులు, ప్రజలతో కలిసి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు.
కౌటగూడలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి పాల్గొన్నారు. జైనూర్ మండలం జంగాం కలెక్టర్ రాహుల్‌రాజ్ శుక్రవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. శనివారం ఉదయం జంగాంతో పాటు రాంజీగూడ, భీంజీగూడ, భూసిమెట్ట గ్రామాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనకయాదవరావ్తో కలిసి పర్యటించారు. దళిత బంధు యూనిట్లను పరిశీలించడంతో పాటు పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
శుక్రవారం రాత్రి దహెగాం మండల పరిషత్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి అధికారులతో కలిసి పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పల్లెనిద్ర శనివారం ఉదయం దహెగాంతో పాటు లగ్గాం, చిన్నరాస్పల్లి, అమర్‌గొండ, గెర్రె, గిరివెల్లి, ఖర్జీ,రాంపూర్, మొట్లగూడ, దిగడ గ్రామాల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని నాలుగో వార్డులో మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు అవగాహన ర్యాలీ తీశారు.