మంచిర్యాల టౌన్, జూన్ 4 : నాలుగోసారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న నడిపెల్లి దివాకర్‌రావు మంచిర్యాల పట్టణంలో కనీసం శ్మశాన వాటిక నిర్మించలేదని కాంగ్రెస్, విపక్షాలు చేస్తున్న విమర్శలకు శాశ్వతంగా చెక్ పెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావుతో పాటు ఆ పార్టీ నాయకులు పదేపదే ఈ విషయాన్ని అస్త్రంగా చేసుకొని ఆరోపణలు చేసేవారు. గోదావరి తీరంలో ప్రభుత్వ భూమి లేకపోవడం, ప్రైవేట్ వ్యక్తులు శ్మశాన వాటికకు భూమి ఇచ్చేందుకు ముందుకు రాకపోవడం లాంటి అంశాలను ప్రతిపక్షాలు వారికి అనుకూలంగా మలచుకుని విమర్శలు చేసేవారు.
మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతిలో ప్రాధాన్యతాక్రమంలో వైకుంఠధామాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అన్ని పట్టణాల్లో ఇవి నిర్మించగా మంచిర్యాలలో మాత్రం సాధ్యపడలేదు. పట్టణంలోని రాజీవ్‌నగర్, అండాళమ్మ కాలనీ, పాతమంచిర్యాల ప్రాంతాల్లో శ్మశాన వాటికలు ఉన్నప్పటికీ.. అవి ఆ ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. పట్టణంలోని ప్రధాన వార్డుల్లో నివసించే వారిలో ఎవరైనా కాలంచేస్తే వారికి గోదావరి నదీతీరంలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతారు. ఇది అనాధిగా వస్తున్నది. కానీ ప్రభుత్వ స్థలం లేకపోవడం వల్ల ఇన్నాళ్లూ ఇది సాధ్యపడలేదు.
ఎలాగైనా శ్మశాన వాటికను గోదావరి నదీ తీరంలో నిర్మించాలని పట్టు దలతో ఉన్న ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ప్రభుత్వ పరంగా భూమిని కొనుగోలు చేయాలని అనుకున్నారు. కానీ అది సాధ్యపడక పోవడంతో ప్రైవేట్‌గా కొనాలని నిర్ణయించారు. ఇందుకోసం పట్టణం లోని ఆయా రంగాల్లోని వ్యక్తులను ఆశ్రయించారు. ఎలా చేస్తే బాగుం టుందన్న అంశంపై చర్చించారు. పలువురు భూముల యజమాను లతో చర్చలు జరిపారు. వారు ససేమిరా ఇవ్వడం కుదరదని చెప్పారు.
అయినా వదలకుండా స్మశాన వాటికకు అనుకూలంగా ఉండే భూ యజమానులతో పలుమార్లు మాట్లాడారు. వారు కోరినంత ధర ఇస్తామని చెప్పారు. చుట్టుపక్కల భూముల యజమానులనుంచి వ్యతిరేకత వచ్చింది. శ్మశాన వాటిక ఉంటే తమ భూముల ధరలు పెరుగవని మొరపెట్టుకున్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్మిస్తామని, పైగా భూముల విలువ పెరుగుతుందని చెప్పి అందరినీ ఒప్పించి ఎకరం నాలుగు గుంటల భూమిని రూ. కోటి 20 లక్షలకు కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డారు. చివరకు భూమి ధర తగ్గించాలని కూడా యజమానిని కోరారు. వారు ధర తగ్గించలేము కానీ తమవంతు సాయం అందిస్తామని చెప్పడంతో ఓకే చెప్పారు.
మంచిర్యాలలో స్మశాన వాటిక స్థలం కొనుగోలుకు విరాళాల కోసం ఓ ఫంక్షన్ హాలులో సమావేశం ఏర్పాటుచేయగా అందులో పట్టణానికి చెందిన వ్యాపారులు, వైద్యులు, లాయర్లు, ఇతర పార్టీల నాయకులు 80 మందికి పైగానే పాల్గొన్నారు. భూ యజమాని రూ. 5 లక్షల విరాళంతోపాటు ఎమ్మెల్యే రూ. లక్షలు, ఇతర ప్రముఖులు తమ విరాళాలను అందించారు. ఇందులో అందరికంటే ఎక్కువగా బీజేపీ సీనియర్ నాయకులు గోనె శ్యాంసుందర్‌రావు రూ. 6 లక్షలు అందించడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి చెందిన లాయర్ రూ. లక్ష ఇచ్చారు. కేవలం 80 మంది అందించిన విరాళాలు రూ. కోటీ 20 లక్షలు పోగయ్యాయి. ఇంకా కూడా ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తుండగా వారిని వద్దని చెబుతున్నారు.
శ్మశాన వాటికకు స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు విమర్శలు మొదలు పెట్టారు. ఆ స్థలం నీటిలో మునిగిపోతుందని, ఎక్కువ రేటుకు కొనుగోలు చేశారని, దాతలను బలవంతపెట్టారని, అసలు దాతల సాయంతో భూమి కొనుగోలు చేయడమేమిటనే ప్రశ్నలు వేశారు.
అయితే కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలకు మిగిలిఉన్న చివరి అస్త్రం శ్మశాన వాటిక ఒకటే కావడం వల్ల ఇకపై వారికి విమర్శించే అవకాశం ఉండదని ఏదో ఒకటి మాట్లాడారు. వాస్తవానికి 14 అడుగులు ఎత్తులో ఉన్న భూమిని, దానికి వెనుక భాగంలో రిటైనింగ్‌వాల్ నిర్మించిఉన్న భూమిని కొనుగోలు చేశారు. అన్ని విధాలా ఆలోచించే భూమిని ఎంపిక చేశారు. కానీ ఏదో ఒకటి మాట్లాడాలన్నట్లు కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారు. మాజీ ఎమ్మెల్సీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
శ్మశాన వాటికకోసం భూమిని కొనుగోలు చేసేందుకు విరాళాలు అందించాలని ఒక్కసారి అడగ్గానే ముందుకు వచ్చిన దాతలకు వందనాలు. మంచిర్యాలలో మంచి సాంప్రదాయం ఉంది. ఏదైనా సమస్య ఉంటే అందరూ కలిసి వస్తారు. ప్రభుత్వ భూమి లేదు.
అక్కడే శ్మశాన వాటిక నిర్మించాలంటే ప్రైవేట్ భూమిని కొనుగోలు చేయడం ఒక్కటే మార్గమని చెబితే అందరూ ఒప్పుకున్నారు. ఇందులో అన్ని వర్గాల వారు ఉన్నారు. పార్టీలకతీతంగా విరాళాలు అందించారు. ఇక విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వారికి అంతా అర్థమవుతుంది.
– నడిపెల్లి దివాకర్‌రావు, మంచిర్యాల ఎమ్మెల్యే