పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఉదయాన్నే ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లె, పట్టణాల బాట పట్టడంతో సందడి నెలకొంటున్నది. సబ్బండ వర్గాలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావడంతో కోలాహలంగా మారుతుంది. పారిశుధ్య, తాగునీటి వసతిని పరిశీలించి పలు సూచనలు చేస్తున్నారు. ప్రజలతో మాట్లాడుతూ మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు.
రెండో రోజైన శనివారం నిర్మల్ జిల్లాకేంద్రంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలిలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఇచ్చోడ మండలం దుబార్‌పేటలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఇంద్రవెల్లి మండలం దొడందలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రెండో రోజైన శనివారం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి పరిశుభత్ర, పచ్చదనం పనులు పరిశీలించారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని రాంరావుబాగ్, బుధవార్‌పేట్ కాలనీల్లో పర్యటించారు.
పట్టణ ప్రగతిలో భాగంగా మురుగు కాలువలు, తాగునీటి సరఫరా వంటి విషయాలను ప్రజల నుంచి తెలుసుకున్నారు. ఏమైన సమస్యలు ఉంటే మున్సిపల్ సిబ్బందికి తెలుపాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలిలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.
ఇచ్చోడ మండలం దుబార్‌పేట పల్లె ప్రగతిలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, ఇంద్రవెల్లి మండలం దొడందలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. నిర్మల్, ఆదిలాబాద్ మున్సిపాలిటీల్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్లు ఈశ్వర్, జోగు ప్రేమేందర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాల ద్వారా పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందాయని, స్థానికులకు అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చుతుందన్నారు. స్థానికులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
