ఆదిలాబాద్ టౌన్, జూన్ 4 : ప్రతి గ్రామం పచ్చదనం, పరిశుభ్రతతో వర్ధిల్లినప్పుడే ప్రగతి సుసాధ్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామంలో శనివారం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీధులన్నీ తిరిగి మురుగు కాలువలు, తడిపొడి చెత్తసేకరణ, డంప్ యార్డులకు చేరవేత తదితరాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఎంపికయిన తంతోలి పాఠశాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. క్రీడా ప్రాంగణానికి స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ సెవ్వ లక్ష్మి, విద్యుత్‌శాఖ ఎస్ఈ జాడే ఉత్తం, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, సర్పంచ్ లక్ష్మి, నాయకులు జగదీశ్, రామన్న, భూమన్న తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 4 : పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక వినాయక్ చౌక్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను హిందూ ధార్మిక సంఘం నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో చేపట్టిన కూడళ్ల అభివృద్ధిని చూడలేక కొందరు రాజకీయ లబ్ధికోసం దేవుడిని అడ్డుపెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. పట్టణంలోని కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. పనులు ముగిశాక వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించామని, దానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కానీ కొందరు కావాలని దేవుని ప్రస్తావన తీసుకువచ్చి రోడ్డుపైకి లాగడం సిగ్గుచేటన్నారు. పనులు పూర్తికాగానే శాస్ర్తోక్తంగా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, సనాతన హిందూ ఉత్సవ సమితి నాయకులు ప్రమోద్ ఖత్రీ, గేడం మాధవ్, కందుల రవీందర్, నర్సాగౌడ్, గండ్రత్ సంతోష్ పాల్గొన్నారు.
బేల, జూన్ 4 : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా బేల మండలంలోని అవల్పూర్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జోగు రామన్న భూమి పూజ చేశారు. రాష్ర్టాన్ని తెచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించి, దేశం దృష్టిని ఆకర్శిస్తున్నదన్నారు. ప్రతి గ్రామంలోని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల అభివృద్ధి కోసమే మన ఊరు- మన బడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాలుగు విడుతల్లో జరిగిన పల్లె ప్రగతి పనులతో గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యం పెరిగిందన్నారు. ఫలితంగా సీజనల్ వ్యాధులు రావడం లేదని తెలిపారు. ఒక్కసారి తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చాక గ్రామాల పరిస్థితిని బేరీజు వేసుకోవాలని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలితరాష్ర్టాల్లో ఇక్కడి పథకాలు ఉన్నాయా అని ఆ పార్టీల నాయకులను ప్రశ్నించారు.
అవల్పూర్లో బోయర్ కార్తీక్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేత జట్లకు ఎమ్మెల్యే బహుమతులు ప్రధానం చేశారు. మొదటి బహుమతిగా లాండసాంగిడి జట్టుకు జోగు పౌండేషన్ ద్వారా రూ.30 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలను జడ్పీటీసీ అక్షిత పవర్, సర్పంచ్ మినక పుష్పలత ఆధ్వర్యంలో అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, నాయకులు గంభీర్ ఠాక్రె, ప్రమోద్ రెడ్డి, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, మెట్టు ప్రహాల్లాద్, మస్కె తేజ్‌రావు, తన్వీర్‌ఖాన్, సుధాంరెడ్డి, సురేశ్, సర్పంచ్ మినక పుష్పలత తదితరులు పాల్గొన్నారు.