నిర్మల్‌కు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కోర్టును మంజూరుచేయగా, సేవలు అందుబాటులోకి వచ్చాయి. స్థానిక పీజీ కళాశాల భవనాన్ని తాత్కాలికంగా కేటాయించగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జిల్లా జడ్జి కర్ణ కుమార్ చేతులు మీదుగా ప్రారంభమయ్యాయి. అలాగే ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 700 కేసులు
ఇక్కడికి బదిలీ అయ్యాయి. దూరభారం తగ్గుతుండడంతో న్యాయవాదులు,
బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
– నిర్మల్ అర్బన్, జూన్ 3
పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జిల్లాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అందుకు అనుగుణంగా సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించి, ప్రారంభించింది. అనతి కాలంలోనే పాత జిల్లాలకు దీటుగా కొత్త జిల్లాలను తీర్చిదిద్దింది. కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు ఉన్న ప్రతి చోటా ప్రజలు, బాధితులకు సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో జిల్లా కోర్టులను మంజూరు చేసింది. అందులో భాగంగా నిర్మల్‌కు జిల్లా కోర్టు మంజూరైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి సేవలను ప్రారంభించుకున్నది.
జిల్లాలు ఏర్పడకముందు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించిన కోర్టు కేసులన్నీ ఉమ్మడి ఆదిలాబాద్ కేంద్రంగానే విచారణ జరిగేది. విస్తీర్ణం ఎక్కువగా ఉండడం, నేరాల శాతం రోజురోజుకూ పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో కేసులుండేవి. దీంతో ఏండ్లకు ఏండ్లుగా పెండింగ్‌లో ఉండేవి. బాధితులు, సాక్షులు, న్యాయవాదులు తీవ్ర నిరాశకు గురయ్యేవారు. నిర్మల్ జిల్లా శివారు గ్రామాల నుంచి ఆదిలాబాద్ 150 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రస్తుతం నిర్మల్‌లో జిల్లా కోర్టు ఏర్పాటు కావడంతో గతంలో ఆదిలాబాద్ జిల్లాకు విచారణకు వెళ్లిన కేసులను ఇక్కడే పరిష్కరించనున్నారు. 700 పెండింగ్ కేసులు జిల్లాకు బదిలీ కానున్నాయి. ఇక నుంచి 19 మండలాలకు సంబంధించి అన్ని రకాల కేసులు ఇక్కడే పరిష్కారమవనున్నాయి.
నిర్మల్ జిల్లా కోర్టుకు అన్ని రకాల కేసులు బదిలీ అవుతుండడంతో పరిష్కారంలో జాప్యం ఉండదని న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులు సత్వరమే విచారణకు రానున్నాయి. నేరస్తులకు శిక్ష పడడం.., బాధితులకు సత్వర న్యాయం జరగనుండడంతో రానున్న రోజుల్లో క్రైమ్ రేటు తగ్గుంతని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జిల్లా కోర్టులను మంజూరు చేసిన రాష్ట్ర సర్కారు, సమీకృత కోర్టు భవనాలను నిర్మించేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా స్థలాలను కేటాయించింది. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల మినహా నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు స్థలాలను మంజూరు చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జన్కాపూర్‌లోని సర్వే నంబర్ 192/1 (పీపీ)లో 2.20 ఎకరాలు.., నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్ కాలనీ (సర్వే నంబర్ 241)లో 5 ఎకరాల్లో భవనాలు నిర్మించనున్నది. రాష్ట్ర న్యాయ, అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కోర్టు ఏర్పాటవడం, సమీకృత భవనానికి స్థలం కేటాయించడం, త్వరలో పనులు ప్రారంభమవనుండడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నుంచి నిర్మల్ జిల్లాలోనే కోర్టు కేసులు పరిష్కారమవుతాయని జిల్లా జడ్జి కర్ణ కుమార్ అన్నారు. జిల్లా కోర్టులో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకో కోర్టును మంజూరు చేయగా, నిర్మల్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించుకున్నామన్నారు. జిల్లా పరిధిలోకి వచ్చే అన్ని రకాల కేసులను ఇక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా కోర్టు సేవలను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.