ఆదిలాబాద్ రూరల్, జూన్ 3 : పట్టణాభివృద్ధిలో పౌరుల భాగస్వామ్యం అవసరమని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా కైలాస్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియం అభివృద్ధికి సంబంధించి రూ.2కోట్లతో చేపట్టనున్న పనులకు శుక్రవారం భూమిపూజ చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆదిలాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నామని తెలిపారు.
రానున్న వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని జూన్ నెలంతా పారిశుధ్య కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలన్నారు. ఖాళీ స్థలాలున్న వారు తమ ప్లాట్లను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హరితహారం కింద ఈ ఏడాది సుమారు 5.50 లక్షల మొక్కలు నాటేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, కౌన్సిలర్ అర్చన, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శైలజ, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, నాయకులు గంగారెడ్డి పాల్గొన్నారు.