‘తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయి. మనల్నే ఇతర రాష్ర్టాలు అనుకరిస్తున్నాయి. భారతదేశానికే మన రాష్ట్రం దిక్సూచిగా నిలుస్తున్నది.’ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఉద్ఘాటించారు. గురువారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలకు మంత్రి, విప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మొదటగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమరులకు నివాళులర్పించి.. తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జడ్పీ చైర్మన్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. నిర్మల్‌లో మంత్రి ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా ప్రతాలు.. వ్యాసరచన, ఉపన్యాసపోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. దళితబంధు కింద మంజూరైన 12 వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్, జూన్ 2 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, అభివృద్ధిలో గర్వించేస్థాయికి ఎదిగిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఎనిమిదో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పారదర్శకంగా అమలు అవుతున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలు మరచిపోమన్నారు. నిర్మల్ జిల్లాలో చేసిన అభివృద్ధిని వివరించారు. పల్లె ప్రగతికి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతో రూ.32 కోట్లను విడుదల చేయడం జరిగిందన్నారు. రైతుబంధు కింద 1.68 మందికి రూ.211కోట్లు, చనిపోయిన రైతు కుటుంబాలకు రైతుబీమా కింద రూ.21 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు.
వృద్ధ్దాప్య, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నామన్నారు. రూ.354 కోట్లతో 272 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించామన్నారు. ఖానాపూర్‌లో వంతెన నిర్మాణానికి రూ.192 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. 6,686 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేయగా.. రూ.130 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. కల్యాణలక్ష్మి కింద 2,936 మందికి, షాదీ ముబారక్ కింద 716 మందికి రూ.36.66 కోట్ల సాయం చేశామన్నారు. ‘మన ఊరు-మన బడి’ కింద 266 పాఠశాలల అభివృద్ధికి రూ.60 కోట్లతో పనులను చేపడుతున్నారు. దళితబంధు కింద 165 మందికి రూ.10 లక్షల చొప్పున అందించినట్లు చెప్పారు.
నిర్మల్ జిల్లాలో 182 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నీలి విప్లవాన్ని సాధించేందుకు సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తున్నామన్నారు. జిల్లాలో హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాబోయే కాలంలో మెడికల్ నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధిలో రూ.75 కోట్లతో చెక్‌డ్యాంలను నిర్మించామన్నారు. 27 ప్యాకేజీ కింద రూ.330 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు.
పరిశ్రమల అభివృద్ధికి 68 యూనిట్లను మంజూరు చేసి రూ.1.94 కోట్ల సబ్సిడీని పంపిణీ చేయడం జరిగిందన్నారు. మున్సిపల్‌శాఖ ద్వారా నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలో రూ 100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను జరుగుతున్నాయన్నారు. ఏడాదిలోపు కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, మేధావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ఉత్తమ అధికారులతోపాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. అదేవిధంగా పోలీసుశాఖలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు ఉద్యోగులకు మెడల్స్‌ను బహూకరించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. దళితబంధు కింద మంజూరైన వాహనాలను మంత్రి అల్లోల, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి అందించారు.
ఎల్లపెల్లి గ్రామానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు రూ. 1.20 కోట్లతో ట్రాక్టర్లు, ఆటోలు.. దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ప్రవీణ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, ఏఎస్పీ కిరణ్‌కారే, అల్లోల సతీమణి విజయలక్ష్మి, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు రాము, ఏఎస్పీ రాంరెడ్డి, డీఎస్పీ జీవన్‌రెడ్డి, జిల్లా అధికారులు వికాస్‌మీనా, విజయలక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి, సుధారాణి, సుధీర్‌కుమార్, హన్మండ్లు, శ్రీకళ, అశోక్‌కుమార్, అంజిప్రసాద్, రమేశ్ కుమార్, సుభాష్, శివప్రసాద్, రవీందర్‌రెడ్డి, నాగేశ్వర్రావు, తుకారాం, శంకరయ్య పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్న పథకాలను దేశం అనుసరిస్తున్నదని, దేశానికే రాష్ట్రం దిక్సూచిగా నిలుస్తున్నదని విప్ గంప గోవర్ధన్ అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆయన జాతీయ జెండాను ఎగురువేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అన్ని వర్గాలకు ఉపాధి మెరుగుపడింన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 249 మందికి దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం వాహనాలు అందించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన 33,452 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. రిమ్స్‌లో పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని, చిన్న పిల్లలకు, మహిళలకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసనట్లు పేర్కొన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా 1,42,916 మంది రైతులకు రూ.535.74 కోట్లను పెట్టుబడి సాయం కింద అందజేసినట్లు తెలిపారు. మత్స్యకారుల ఉపాధిలో భాగంగా 271 చెరువుల్లో 1.24 కోట్ల చేప పిల్లలను వదిలామన్నారు.

ప్రభుత్వం చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి ద్వారా పరిశుభ్రత నెలకొనడంతోపాటు పచ్చదనం వెల్లివిరుస్తున్నదన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.12 కోట్లు విడుదల కాగా 41 పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా 59 వేల కుటుంబాలకు పని కల్పిస్తున్నట్లు తెలిపారు. హరితహారం కింద ఈ ఏడాది 44.74 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో భాగంగా 6,016 కుటుంబాలకు రూ.60.22 కోట్ల అందించామన్నారు.
10,892 మంది రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నట్లు తెలిపారు. టీఎస్ ఐపాస్ కింద 181 పరిశ్రమలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. మిషన భగీరథలో ద్వారా 1,180 గ్రామాలకు నల్లానీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు.
