మంచిర్యాల, జూన్ 1, నమస్తే తెలంగాణ :మంచిర్యాల జిల్లాలో గురువారం నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల (బాలుర) మైదానంలో ఏర్పాట్లను సంబంధిత అధికారులు పరిశీలించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హాజరై, ఉదయం 9 గంటలకు జెండా ఎగురవేయ నున్నారని కలెక్టర్ భారతీ హోళీకేరి తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.40 గంటల వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఉదయం 8.30 నుంచి 8.40 గంటల వరకు బైపాస్ రోడ్డున గల అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి.. నివాళులర్పించనున్నట్లు తెలిపారు. 8.40 నుంచి 8.50 గంటల వరకు బైపాస్ రోడ్డులో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయనున్న ట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 9.05 గంటల వరకు జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆవిష్కరించ నున్నారు. ఉదయం 9.30 నుంచి 9.40 గంటల వరకు గౌరవ వందనం స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
ఆసిఫాబాద్,జూన్ 1 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అథితిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ హాజరుకానున్నారు. మొదట చిల్డ్రన్ పార్క్‌లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. అ నంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌కు చేరుకొని అక్కడ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి వివరించనున్నారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జిల్లా లోని వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.