మంచిర్యాల, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ఎనిమిదేళ్ల క్రితం ఆవిర్భవించిన ప్రత్యేక రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన రాష్ట్ర సర్కారు, సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా సబ్బండ వర్గాల అభ్యున్నతికి లెక్కకు మించి పథకాలు అమలు చేస్తున్నది.
2014లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా 2016, అక్టోబర్ 11న 18 మండలాలతో మంచిర్యాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పాటు తర్వాత పాలన, పర్యవేక్షణ విషయాల్లో మెరుగైన మార్పు వచ్చింది. గోదావరి నదిపై, వాగులపై బ్రిడ్జిలు పూర్తవడంతో రవాణా వ్యవస్థ మెరుగుపడింది. జగ్ధల్‌పూర్, మహారాష్ట్రల నుంచి జిల్లాకు బస్సులు వస్తుండడం, సంబంధాలు కొనసాగుతుండడంతో వ్యాపారం వృద్ధి చెందుతున్నది. పారిశ్రామిక, పర్యాటక, అటవీ పాంత్రం ఉండడంతో ఉపాధి ఖిల్లాగానూ ఉంది. జిల్లాలో మెడికల్ కళాశాలను, అనుబంధంగా నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిచేయడంతో జిల్లావాసుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా 2018, ఫిబ్రవరి 27న కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పలు వరాల జల్లులు కురిపించారు. అవి అమలుకు నోచుకోవడంతో జిల్లా ప్రజలు ముఖ్యమంత్రికి జేజేలు పలుకుతున్నారు. సింగరేణిని ప్రైవేటీకరించాలని బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, ఆరునూరైనా సింగరేణిని ప్రైవేటీకరించేది లేదని తేల్చిచెప్పారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కార్మికుల పక్షాన ఉద్యమ బాట పట్టారు.
సింగరేణి కార్మికులకు ఉచితంగా మంచినీరు, కరంటు సరఫరా చేస్తామని చెప్పి అమలు చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు రాకుండా సింగరేణి వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాలు అని మార్చారు. సింగరేణి ప్రాంతంలో ఇండ్లు నిర్మించుకున్న వారికోసం జీవో 76 తీసుకొచ్చి పట్టాలు అందించారు. మంచిర్యాల – అంతర్గాం హైలెవల్ బ్రిడ్జికి ఆర్థిక శాఖ నుంచి ఇటీవల ఆమోదం లభించింది.
హైదరాబాద్ వెళ్లేందుకు గోదావరిఖని నుంచి కాకుండా అంతర్గాం.. రామగుండం మీదుగా వెళ్తే 20 కిలోమీటర్లు తగ్గుతుందని, హైలెవల్ బ్రిడ్జి మంజూరు చేయాలని ఎన్నికల సమయంలో మంచిర్యాల దివాకర్ రావు గుర్తు చేశారు. రూ.164 కోట్లతో త్వరలో టెండర్లు పిలువాలని ఆర్థిక శాఖ నుంచి ఆదేశాలు రావడంతో జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి రూ.1,658 కోట్లతో పరిపాలనా అనుమతులు ప్రభుత్వం జారీ చేసింది. ఉత్తర్వులు జారీ కావడం, లక్షకు పైగా ఎకరాలకు కాళేశ్వరం జలాలు అందనుండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. బీడు భూములు సస్యశ్యామలం కానుండడంతో సీఎం కేసీఆర్, విప్ బాల్క సుమన్‌కు చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఈ ఎనిమిదేళ్లలో జిల్లా అనూహ్యంగా అభివృద్ధి చెందింది. సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నది. తాగు, సాగునీరుతో పాటు రోడ్లు, వంతెనలు, విద్య, వైద్యం, మౌలిక రంగాల్లో పల్లెలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. 2016, అక్టోబర్ 11న 15 మండలాలతో కుమ్రం భీం ఆసిఫాబాద్ పేరిట ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలకు పాలన మరింత చేరువైంది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలు, గ్రామాల నుంచి మండల కేంద్రాలకు రోడ్లు నిర్మించారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 90 శాతం గ్రామాలకు (1100 ఆవాసాలు) స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నది. జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. పల్లె ప్రగతి కార్యక్రమాలతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. వైకుంఠధామాలు, డంప్‌యార్డులు నిర్మించింది. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను సమకూర్చింది. ఊరూరా పల్లె ప్రకృతి వనాలు నిర్మించింది. బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరిస్తున్నది.
జిల్లాలో 502 చెరువులకుగాను, 372 చెరువుల్లో పనులు ప్రారంభించగా, 305 చెరువులను పూర్తి చేసింది. ప్రస్తుతం వీటి ద్వారా సుమారు 27 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 55 కోట్లు ఖర్చుచేసింది. దీంతోపాటు జిల్లాలో మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల కోసం నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది. వట్టి వాగుకోసం రూ. 85 కోట్లు, చెలిమెల వాగు ప్రాజెక్టు కోసం రూ. 35 కోట్లతో ప్రణాళికలు తయారుచేసి సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. కుమ్రం భీం పోరుగడ్డగా చరిత్రకెక్కిన జోడెఘాట్‌ను ప్రభుత్వం రూ. 25 కోట్లతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసింది.
కెరమెరి మండలం జోడెఘాట్‌లో స్మారక చిహ్నం, స్మృతివనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయడంతో పాటు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకువచ్చింది. కేసీఆర్ సీఎంగా అధికారంలోకి రాగానే జోడెఘాట్‌ను సందర్శించిన తొలి ముఖ్యమంత్రిగా నిలిచారు. సరైన రహదారికి నోచుకోని జోడెఘాట్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ. 15.95 కోట్లతో రెండు వరుసల రహదారిని నిర్మించింది. కెరమెరి మండలం హట్టి నుంచి 23 కిలోమీటర్ల దూరంలోని జోడెఘాట్‌కు 8 గ్రామాలను కలుపుతూ రెండు వరుసల రహదారి నిర్మాణం పూర్తయ్యింది.
టీఆర్ఎస్ సర్కారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. రైతుబంధు, రైతుబీమా పథ కాల ద్వారా అన్నదాతల జీవితాలే మారిపోయాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు, కేసీఆర్ కిట్స్, రూ.200ల పింఛన్ రూ.2 వేల పైబడి పెరిగింది. వివిధ వర్గాలకు ఓవర్సీస్ స్కాలర్షిప్పులు ఇస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేశంలో బీజేపీ పాలించే ఏ రాష్ర్టాల్లో లేని ఎన్నో విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది.
తెలంగాణ ట్యాగ్‌లైనే నీళ్లు, నిధులు, నియామకాలు అని ఉద్యమ సమయంలోనే చెప్పిన ముఖ్యమంత్రి.. వాటిని ఆచరణ రూపంలో పెడుతున్నారు. ముందుగా సకల సమస్యలకు మూలమైన నీటి ఇబ్బందిని తొలగించే అంశంపై దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున కొలువల భర్తీపై దృష్టి పెట్టారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో దాదాపు 80 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించి విడుతల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. అంతేకాదు.. కొత్త జోనల్ విధానం తీసుకురావడం వల్ల ఇక్కడి పోస్టులు ఈ ప్రాంత ఉద్యోగార్థులకు దక్కే అవకాశాలు ఏర్పడ్డాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. సమైక్య రాష్ట్రంలో దగాపడ్డ తెలంగాణ ఇప్పుడు సగర్వంగా తలెత్తుకొనే స్థాయికి చేరుకుంది.