ఎదులాపురం,జూన్ 1 : రెవెన్యూ ఇన్స్పెక్టర్ను కులంపేరుతో దూషించి గాయపరిచిన కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు, రూ.1500 జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎం.సతీశ్‌కుమార్ బుధవారం తీర్పు వెలువరించారు. ఈ మేరకు కోర్టు లైజన్ అధికారి ఎం.గంగాసింగ్, కోర్డు డ్యూటీ అధికారి ఎం.శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 24న ఆదిలాబాద్ పట్టణంలోని తిలక్‌నగర్‌లో ఉదయం 6 గంటలకు ఇంటి ముందర రోడ్డుపై గెడాం గీత తన భర్తతో కలిసి వాకింగ్ చేస్తున్నది. అదే కాలనీకి చెందిన పోల్కంవార్ అశోక్ బాధితురాలిని అడ్డగించి బూతులు తిడుతూ ఇద్దరిపై రాళ్లు రువ్వి గాయపరిచాడు.
అందరూ చూస్తుండగా కులం పేరుతో దూషిస్తూ అవమానపర్చడమే కాకుండా ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. రాళ్లదాడిలో గీత కుడి చేతికి గాయమైంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఆదిలాబాద్ టూ టౌన్ ఎస్ఐ అశోక్ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరావు దర్యాప్తు చేసి నివేదిక అందజేశారు.
ఈ కేసులో ప్రత్యేక పీపీ ఈ కిరణ్ కుమార్ రెడ్డి తొమ్మిది మంది సాక్షులను ప్రవేశ పెట్టి విచారించారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎం.సతీశ్ కుమార్ నిందితుడు పోల్కంవార్ అశోక్‌కు సెక్షన్ 294బీ ఐపీసీ కింద రెండు నెలల జైలు, 506 ఐపీసీ కింద ఆరునెలల జైలు, రూ.500 జరిమానా, 3(1)(ఆర్)(ఎస్) ఎస్సీ, ఎస్టీ (పీవోఏ) యాక్ట్ కింద ఆరు నెలల జైలు, రూ.500 జరిమానా విదించారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని, ఆరునెలల జైలు శిక్ష, మొత్తం జరిమానా రూ.1500 కట్టాలని ఆదేశించారు. జరిమానా కట్టలేని పక్షంలో మరో ఒక నెల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. ఈ మేరకు ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి కోర్టు లైజన్ అధికారి ఎం గంగాసింగ్, కోర్టు డ్యూటీ అధికారి ఎం శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు.