నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
సచ్చినా సరే.. స్వరాష్ట్రం సాధిస్తా..
స్వయం పాలనతోనే కష్టాలు దూరం..
ఆంధ్రా పాలకుల దోపిడీకి అడ్డుకట్ట వేద్దాం..
మీకోసం కాకున్నా.. మీ పిల్లల కోసం పోరాడండి..
అంటూ జనాన్ని చైతన్యవంతులను చేశారు..
ఉద్యమం వైపు జనసాగరాన్ని నడిపించారు.
– సీఎం కేసీఆర్
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల విధ్వంసం.. భాషను వక్రీకరించి అవహేళన చేయడం.. నీళ్లు, నిధులు, నియామకాలను దోచుకోవడం.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించ పరిచే తరుణంలో.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా అనాటి ఉద్యమ దళపతి, నేటి ప్రగతి రథసారథి, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. 2001లో నిర్మల్, 2003లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి తెలంగాణ ఆవశ్యకతపై నినదించారు. పుష్కర కాలం పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అలుపెరగని యుద్ధం చేసి.. ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ సాధించారు. పగ్గాలు చేపట్టిన ఏడేళ్లలోనే యావత్ దేశం అబ్బుర పడేలా పథకాలను అమల్లోకి తెచ్చారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి బాటలు వేశారు. తెలంగాణ పూర్వవైభవం సంతరించుకోవాలంటే.. నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని పట్టుబట్టి సాధించారు. ఆ దిశగా ప్రగతిని పరుగులు పెట్టించారు. ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని నేడు తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖచిత్రమే మారిపోయింది.
ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్, జూన్ 1(నమస్తే తెలంగాణ) : నీళ్లు, నిధులు నియామకాలతోపాటు ప్రత్యేక అస్థిత్వం, స్వపరిపాలన సాధన కోసం సాగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి నిర్మల్ గడ్డ మొ దటి అడ్డాగా నిలిచింది. నాటి ఉద్యమ దళపతి, ప్రస్తుత సీఎం కే.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర నినాదం ఇక్కడి నుండే హోరెత్తింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ మొదటి సమావేశం 2001లో నిర్మల్‌లోనే జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిర్మల్ బహిరంగ సభలోని ప్రసంగాలు ఊరూరా ఉద్యమ జ్వా లను రేకెత్తించాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి పాలకుల దాష్టీకాలకు ఎదురొడ్డి నినదించే వారి పై ఎన్నో నిర్భందాలు కొనసాగాయి. అలాంటి నిర్భందాలను సైతం ఎదిరించి స్వయం పాలన కోసం గొంతెత్తేందుకు నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభ తోడయ్యిం ది. ఆనాటి బహిరంగ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం జాతీయ స్థాయిలో తెలంగాణ ఆవిర్భావం ప్రాధాన్యతను వెల్లడించడమే కాకుండా, వందలాది మంది మేధావులు, విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులను పోరాట పథం వైపు మళ్లించింది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావాన్ని పురస్కరించుకొని నిర్మల్‌లో చాలా మంది కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ముఖ్య నాయకులు గులాబీ గొడుగు కిందికి చేరుకున్నారు. కాంగ్రెస్, టీడీపీల నుండి తమకు విముక్తి లభించిందని వారు సంబుర పడ్డారు. వీరి బాటలోనే వేలాది మంది టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమ గొంతుకగా నిలవడమే కాకుండా కేసీఆర్‌కు వెన్నుదన్నయ్యారు.
తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన ప్రసంగం ఊపిరిలూదింది. నీళ్లు, నిధులు, నియామకాలపై ఉద్వేగంగా, అనర్గళంగా మాట్లాడిన తీరు సాధారణ ప్రజల నుంచి మేధావి వర్గాల వరకు ఆలోచనలు రేకెత్తించింది. తెలంగాణకు మొదటి నుంచి జరుగుతున్న అన్యాయా న్ని కండ్లకు కట్టినట్టు ఉదాహరణలతో వివరించడం, తెలంగాణవాసులపై ఉమ్మడి పాలకుల వివక్ష, అణచివేత ధోరణి లాంటి అంశాలను హైలైట్ చేస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగం లక్షలాది మందిని ఉద్యమ పథంలో నిలిపింది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, వె నుకబాటుపై మాటల తూటాలు పేల్చడంతో కళ్లకు యు వకులు, కుల సంఘాల సభ్యులు, మైనార్టీలు జయహో కేసీఆర్ అంటూ నినదించారు. ‘సచ్చినా సరే.. స్వరాష్ట్రం సాధిస్తా.., స్వయం పాలనతోనే కష్టాలు దూరం.., ఆంధ్రా పాలకుల దోపిడీకి అడ్డుకట్ట వేద్దాం.., మీకోసం కాకున్నా.. మీ పిల్లల కోసం పోరాడండి..’ లాంటి మాటలు ప్రజల్లోకి బలంగా నాటుకుపోయాయి.
సమైక్య రాష్ట్రంలో ఆదిలాబాద్ అంటేనే కరువు జిల్లా.. ఎటు చూసినా.. నెర్రలు వాసిన నేలలు.. అడుగంటిన భూగర్భజలాలు.. అన్నదాతల అగచాట్లు.. అత్మహత్యలు.. ఇలా గతాన్ని తలుచుకుంటేనే గుబులు పుడుతది. ఆ కష్టాలను నెమరేసుకుంటే.. కండ్లలో నీళ్లు తిరుగుతాయి. కానీ.. స్వరాష్ట్రం సాధించిన తదుపరి.. కేవలం ఏడేండ్ల కాలంలో ఉమ్మడి జిల్లా ముఖచిత్రం మారిపోయింది. ముఖ్యమంత్రి దూరదృష్టితో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పరిపాలన సౌలభ్యానికి ఉమ్మడి జిల్లా నాలుగు జిల్లాలుగా మారింది. ఫలితంగా పాలన మారుమూల ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చింది. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు పెరిగాయి. సాగు, తాగునీటి గోసలు దూరమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. సాగునీటి రంగం సమూలంగా మారిపోయింది. నిజానికి ఇన్ని సాధ్యమా అంటూ మిమర్శలు చేసే వారి మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన ముఖ్యమంత్రి.. వాటన్నింటిని కళ్ల ముందు సాక్షాత్కరింప చేశారు. మిషన్ కాకతీయ కింద చెరవులను పునరుద్ధరించారు. ప్రాజెక్టులు, చెరువులకు మరమ్మతులు చేయించడం, చెక్ డ్యాంలను నిర్మించడంతో జలకళ ఉట్టిపడుతున్నది. ఫలితంగా వ్యవసాయం రెండింతలైంది. ఏ గ్రామానికి వెళ్లి చూసినా ధాన్యపు రాసులే కనిపిస్తున్నాయి. ఇదంతా కేవలం ఏడేండ్లలో జరిగిన అభివృద్ధి మాత్రమే. ఇదే కాదు.. నాడు కరెంటు ఉంటే వార్త. నేడు కరెంటు పోతే వార్త. ఇచ్చే రెండు మూడు గంటలకు కూడా లో ఓల్టేజీ ఇవ్వడం వల్ల వేలాది మోటార్లు కాలిపోయేవి. కానీ.. కను రెప్పపాటు కూడా కరెంటు పోవడం లేదు. రైతుల జీవితాలు సమూలంగా మారిపోయాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదాయ వృద్ధిరేటు పెరిగింది. వ్యవసాయ రంగ భూముల ధరలు భారీగా పెరిగాయి. రైతుబంధు, రైతుబీమా పథకాల ద్వారా అన్నదాతల జీవితాలు ఉన్నతంగా మారాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు, కేసీఆర్ కిట్స్, రూ.200 పింఛన్ 2వేల పైబడి పెరిగింది. వివిధ వర్గాలకు ఓవర్సీస్ స్కాలర్ షిప్పులు ఇస్తున్నారు. మిషన్ భగీరథ కింద స్వచ్ఛమైన నీరు ఇంటింటికీ అందుతున్నది. ఒక్క మాటలో చెప్పాలం టే.. దేశంలో బీజేపీ పాలించే ఏ రాష్ర్టాల్లో లేని ఎన్నో విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎ స్ ప్రభుత్వానిది. తెలంగాణ ట్యాగ్‌లైనే నీళ్లు, నిధు లు, నియామకాలు అని ఉద్యమ సమయంలోనే చెప్పిన సీఎం.. వాటిని ఆచరణ రూపంలో పెడుతున్నారు. ముందుగా సకల సమస్యలకు మూలమైన నీటి ఇబ్బందిని తొలగించారు. హరితహారంలో భాగంగా ఎనిమిది విడుతలుగా కోట్లాది మొక్కలు నాటి పచ్చదనాన్ని పెం పొందించారు. ఫలితంగా వర్షాలు సమృద్ధిగా పడడంతో జలసవ్వడులు వినిపిస్తున్నాయి. ఇక పెద్ద ఎత్తున కొలువల భర్తీపై దృష్టిపెట్టారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏక కాలంలో దాదాపు 80,039 పైచిలుకు పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించి విడుతలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి జిల్లాలో సుమారు ఎనిమిది వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. కొత్త జోనల్ విధానం వల్ల స్థానికులకే ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. సమైక్య రాష్ట్రంలో దగా పడ్డ తెలంగాణ ఇప్పుడు సగర్వంగా తలెత్తుకొనే స్థాయికి చేరుకుంది.
ఎదులాపురం/నిర్మల్ అర్బన్, జూన్ 1 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కలెక్టరేట్లలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదిలాబాద్‌లో ఏర్పాట్లను ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. నిర్మల్‌లో వేడుకలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్‌లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఆదిలాబాద్‌లోని ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలో 8:35 గంటలకు గంప గోవర్ధన్, నిర్మల్ కలెక్టరేట్లో మంత్రి అల్లోల 8:50 గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పించనున్నారు. 9 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, తమ సందేశం అందించనున్నారు. నిర్మల్‌లో 9:35 నుంచి 10:15 గంటల వరకు ప్రశంసా పత్రాల పంపిణీ ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

ఎదులాపురం, జూన్ 1 : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనేందుకు కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు. బుధవారం రాత్రి టీటీడీసీలో ఉండగా.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కలిసి పూలమొక్క అందజేశారు. శాలువాతో సత్కరించారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్ నటరాజ్, ఆర్డీవో రమేశ్ ఉన్నారు.

ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2003లో ఆదిలాబాద్‌కు వచ్చారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. కేసీఆర్ ప్రసంగిస్తున్న సేపు చప్పట్లు కొట్టారు. జిల్లాలోని సమస్యలను ఉద్యమ నేతకు వివరించాం. పెన్‌గంగపై ప్రాజెక్టు నిర్మించాలని రైతులు 40 ఏళ్లుగా కోరుతున్నారని తెలియజేశాం. అప్పుడు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నేరవేర్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. మారుమూల గ్రామాలకు రవాణా సమస్యలను తెలియజేశాం. ఇప్పుడు ప్రతి గ్రామానికీ రోడ్డు సౌకర్యం కలిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడేళ్లలో జిల్లాలో అభివృద్ధి జరుగుతున్నది. ప్రజలు ఎప్పటికీ గులాబీ పార్టీ వెంటే ఉంటారు.
– లోక భూమారెడ్డి, మాజీ చైర్మన్, డీడీసీ
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2003లో ఇచ్చోడకు వచ్చారు. అప్పటి సభకు జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉద్యమ సమయంలో జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలోని అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నయ్. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
– ఏనుగు మోహన్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్

తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ 2003 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారు. క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేపట్టాల్సిన విషయాలపై కులంకషంగా వివరించారు. సాగునీటి ఇబ్బందులు తప్పేందుకు పెన్‌గంగపై ప్రాజెక్టు నిర్మాణం చేస్తానని చెప్పారు. రవాణా సౌకర్యం మెరుగుపరుస్తానన్నారు. కేసీఆర్ చెప్పినట్టు గానే.. స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం చనాక-కొరట ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎం కేసీఆర్, అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు మహారాష్ట్ర వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిలో చర్చలు జరిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కొరాట వద్ద రూ.386 కోట్లతో చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అన్ని గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఏర్పడింది. ఉద్యమ నేతగా కేసీఆర్ ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చడంతో జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.