ఆదిలాబాద్ రూరల్, జూన్ 1 : పదోతరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం ఆదిలాబాద్లో నేటి నుంచి నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హైస్కూల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఉపాధ్యాయులకు విధులు కేటాయించారు.
మూల్యాంకనం కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు సుమారు 1,095 మంది ఉపాధ్యాయులకు విధులు అప్పగించారు. ఆదిలాబాద్ నుంచి 541, కుమ్రం భీం ఆసిఫాబాద్ నుంచి 106 మంది, మంచిర్యాల నుంచి 449 మంది ఉపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది 3.25 లక్షల జవాబు పత్రాలు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రానికి చేరుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
మూల్యాంకనానికి వివిధ స్థాయిలో ఉపాధ్యాయులను నియమించారు. తెలుగు, ఉర్దూ మీడియాలకు సంబంధించి 132 మంది ఏఈలు, 23 మంది సీఈలు, స్పెషల్ అసిస్టెంట్లు 46, హిందీ సబ్జెక్టుకు సంబంధించి ఏఈలు 115, సీఈలు 19, స్పెషల్ అసిస్టెంట్లు 38 మంది.., ఇంగ్లిష్ సబ్జెక్టులో ఏఈలు 117, సీఈలు 20, స్పెషల్ అసిస్టెంట్లు 38 మందిని నియమించారు.
గణితంలో ఏఈలు 96, సీఈలు 17, స్పెషల్ అసిస్టెంట్లు 34.., భౌతిక శాస్త్రంకు సంబంధించి ఏఈలు 65, సీఈలు 11, స్పెషల్ అసిస్టెంట్లు 22.., జీవశాస్త్రంకు సంబంధించి ఏఈలు 123, సీఈలు 21, స్పెషల్ అసిస్టెంట్లు 42.., సాంఘిక శాస్త్రంకు సంబంధించి ఏఈలు 129, సీఈలు 22, స్పెషల్ అసిస్టెంట్లు 44.., ఊర్దూ మీడియం లో ద్వితీయ భాషకు ఏఈలు 40, సీఈలు 7, స్పెషల్ అసిస్టెంట్లు 14 మందిని నియమించారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం నిర్వహించనున్నట్లు డీఈవో టామ్నె ప్రణీత తెలిపారు.