హాజీపూర్, మే 30 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ఐదో విడుత కార్యక్రమాన్ని జిల్లాలో జూన్ 3 నుంచి 18 తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ భారతీ హోళికేరి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంపై మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి హాజరయ్యారు. సమస్యల్లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పల్లె ప్రగతి నిరంతరాయంగా చేపట్టాల్సిన కార్యక్రమమన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఎలాంటి వ్యాధులు దరి చేరవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించడం వల్ల స్వచ్ఛమైన వాయువు ద్వారా జీవవైవిధ్యంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతాయన్నారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి జరుగాలని, ఇందుకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద అవసరమైన చోట పనులు చేపట్టాలని తెలిపారు.
జిల్లాలో స్వచ్ఛభారత్ పథకం కింద 99.8 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయన్నారు. 2019లోనే బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత జిల్లాగా ప్రకటించినట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్తూ ఇంకుడు గుంతల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు. జడ్పీసీఈవో కాకరాల నరేందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావు, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, మండల ప్రత్యేకాధికారులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
హాజీపూర్, మే 30 : పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి పేర్కొన్నారు. అధికారులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్, మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి ఏసీపీలు తిరుపతి రెడ్డి, నరేందర్, ఎడ్ల మహేశ్, ఆర్డీవోలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ బాధితులకు సత్వర న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటుందన్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని, బాధితులకు న్యాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం జిల్లాలో నమోదైన కేసులను పరిష్కరించడంతో పాటు పరిహారం సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గ్రామాల్లో సివిల్ రైట్స్ డే సందర్భంగా నిర్వహించే సభల్లో పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, అటవీ, ఆరోగ్య సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు వేణు, శ్యామలాదేవి, కమిటీ సభ్యులు జిల్లపెల్లి వెంకటేశ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
హాజీపూర్, మే 30 : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధ్దంగా నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్, పంచాయతీ అధికారి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ.. నాలుగు విడుతల పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అన్నిశాఖల అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ప్రజలను భాగస్వాములను చేసి విజయవంతం చేశామన్నారు. ఇదే స్ఫూర్తితో ఐదో విడుత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నరేందర్, జడ్పీసీవో నరేందర్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావు సంబంధిత తదితరులు పాల్గొన్నారు.