మంచిర్యాలటౌన్, మే 30 : మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక అనవసర విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావుపై ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మండిపడ్డారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నాయకులతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. అన్యాయాలు, అక్రమాలకు పాల్పడ్డావని విమర్శించారు. ఎన్నికల సమయంలో తనకు 25 వేల ఓట్ల మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానన్న పీఎస్ఆర్.. ఎందుకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారని ప్రశ్నించారు.
ఆరేళ్లు ఎమ్మెల్సీగా ఉండి ఇక్కడి ప్రజలకు ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతర్గాం బ్రిడ్జి నిర్మిస్తే యావత్ ప్రజానీకానికి ఎంతో ఉపయోగపడుతుందని, తనకు మాత్రమే కాదని పేర్కొన్నారు. తన కుమారులకు సంబంధించి మాట్లాడుతున్నారని, పెద్దకొడుకు 2005లో, కోడలు 2006లో లండన్‌కు వెళ్లి అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారని, వారిద్దరి జీతం పెద్ద ఎత్తున ఉంటుందన్నారు. తాను 1992లోనే సొంత ఇల్లు కట్టుకున్నానని తెలిపారు. మంచిర్యాలను జిల్లా కేంద్రంగా చేస్తున్న సమయంలో బెల్లంపల్లిని ప్రతిపాదించిన వ్యక్తి.. ఇప్పు డు ఇక్కడ ఎందుకు ఉంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
దమ్ముంటే మంచిర్యాలకు వైకుంఠధామం, అంతర్గాం బ్రిడ్జి వద్దని బహిరంగంగా ప్రకటన చేయగలరా? అని సవాల్ విసిరారు. నియోజక వర్గంలో అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, ప్ర జాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతారన్నారు. భీమిని మం డలం మెట్పల్లి, నాయికినిపేట గ్రామాల రైతుల పరిహారం డబ్బులు ఇవ్వాలని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్‌చైర్మన్ ముఖేశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, నడిపెల్లి ట్రస్టు చైర్మన్ విజిత్‌రావు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పల్లపు తిరుపతి, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.