నేరడిగొండ, మే 30 : ఉపాధ్యాయులు ఆంగ్ల నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. మండలంలోని లఖంపూర్ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో సోమవారం బోథ్, నేరడిగొండ మండలాల గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఈఎల్ఈసీపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వం అన్ని సర్కారు పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్ల బోధన ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యార్థులతో ఎలా మాట్లాడాలి అనే అంశంపై కేఆర్పీ విజయ వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమం ఐదు రోజులు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ కుమ్రం జంగు, కన్వీనర్ చందన్, కో కన్వీనర్ అశోక్‌రావ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, మే 30 : ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సోయం దస్రు సూచించారు. గుడిహత్నూర్ మండలం తోషం ఆశ్రమోన్నత పాఠశాలలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కన్వీనర్ సరస్వతి, కో కన్వీనర్ కనక అభిమాన్, శిక్షకులు పార్థసారథి, అంబరావ్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, మే 30 : కార్పొరేట్‌కు దీటుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ ఉట్నూర్) డీడీ సంధ్యారాణి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బోథ్ డివిజన్లోని ఇచ్చోడ, లఖంపూర్, జాతర్ల గ్రామాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఆంగ్లంలో విద్యను బోధించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏటీడీవో సౌజన్య, జీసీడీవో ఛాయ, రాష్ట్ర పరిశీలకురాలు శైలజ, ప్రేమ్‌దాస్, కో ఆర్డినేటర్లు అనూష, శశికాంత్, ప్రధానోపాధ్యాయుడు ఉత్తమ్‌దాస్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, మే 30 : ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమం బోధనలో మెళకువలు నేర్చుకోవాలని ఏటీడీవో క్రాంతికుమార్ సూచించారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులకు విద్య బోధనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సబ్జెక్టులోని అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.