ఉట్నూర్, మే 30 : ఉపాధ్యాయులు ఆంగ్లంపై ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో అంకిత్ సూచించారు. మండల కేంద్రంలోని కుమ్రం భీం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఐటీడీఏ ఏటీడబ్ల్యూవోఏసీ చైర్మన్ కనక లక్కేరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో 12 సెంటర్ల ద్వారా 518 మంది ఉపాధ్యాయులకు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏడు సెంటర్ల ద్వారా 333 మందికి, మంచిర్యాల జిల్లాలో రెండు సెంటర్ల ద్వారా 75 మందికి, నిర్మల్ జిల్లాలో ఒక సెంటర్ ద్వారా 48 మందికి, మొత్తం 22 సెంటర్ల ద్వారా 973 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీఎంవో జగన్, జిల్లా క్రీడాధికారి పార్థసారథి, కన్వీనర్ విఠల్, శిక్షకులు గోవింద్, శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కేబీసీ నారాయణ ఉట్నూర్‌లో ఐటీడీఏ పీవో అంకిత్, డీడీ సంధ్యారాణిని కలిసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమాల్లో పని చేస్తున్న నాల్గో తరగతి ఉద్యోగుల వేతనాలు పెంచడం చాలా సంతోషకరమన్నారు. జీతాలు పెంచినందుకు కలెక్టర్, పీవో, డీడీకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.
గిరిజనులు ఐటీడీఏ ద్వారా అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన దర్బార్ నిర్వహించారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చిన గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తలమడుగు మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన నైతం బాలు భూమి సమస్య గురించి విన్నవించారు.
బజార్హత్నూర్ గ్రామానికి చెందిన మెస్రం తులసీబాయి సేల్స్‌మెన్ ఉద్యోగం ఇప్పించాలని, కొలాంగూడ గ్రామానికి చెందిన భీంరావ్ తన సమస్యలు పరిష్కరించాలని, నేరడిగొండ గ్రామస్తులు తాగునీటి సమస్య పరిష్కరించాలని, మారుతిగూడ గ్రామానికి చెందిన నాగేశ్వరి ఆర్థిక సాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ నాగోరావ్, డీడీ సంధ్యారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.