“ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి. గ్రామ పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలి. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కష్టపడి పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి.” అని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
ఎదులాపురం,మే30: ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాలపై ఆదిలాబాద్ జడ్పీ సమావేశం మందిరంలో సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడారు. పల్లె ప్రగతి కార్యక్రమాలను 15 రోజుల పాటు షెడ్యూల్ ప్రకారం చేపట్టాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, హరితహారం కార్యక్రమాలపై కార్యదర్శులు బాధ్యతగా పని చేయాలని కోరారు. హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటిని కాపాడాలని కోరారు. ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం విజయవంతం చేయాలన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని కోరారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా యాదాద్రి మోడల్లో కొత్త మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో విరివిగా మొక్కలు పెంచాలన్నారు. గ్రామాల్లోని వైకుంఠధామాల్లో నీరు, విద్యుత్ సరఫరా, బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి హాస్టల్లో న్యూట్రీషన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీడీఏ అధికారులు, సిబ్బందిని కూడా పల్లె ప్రగతి కార్యక్రమంలో వినియోగించుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు.
పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టాన్నారు. రెండో సెషన్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడారు. బోథ్ నియోజక వర్గంలో గతంలో చేపట్టిన పనులతో అవార్డులు వచ్చాయని, అదే తరహాలో ముందుకు సాగాలని కోరారు. కార్యదర్శులు ఆయా గ్రామాల్లో ఉదయం 6 గంటలకు పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. సమావేశంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీఏ కిషన్, జడ్పీ సీఈవో గణపతి, అదనపు డీఆర్డీఏ రవీందర్ రాథోడ్, డీఎస్సీడీవో భగత్ సునీత కుమారి, డీఎంవో డాక్టర్ శ్రీధర్, ఆర్డబ్ల్యూఎస్ఈ వెంకటేశ్వర్లు, సంక్షేమ అధికారి మిల్కా, ఎంపీడీవో, ఎంపీవోలు ,ఏపీవోలు , కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని మామిడిగూడెంలో సోమవారం గిరిజనులు సంప్రదాయబద్ధంగా బావేయ్ పేన్ద పూజలు నిర్వహించారు. చిన్నారులు కప్పను రోకలికి కట్టి.. బావేయ్ కుకు అంటూ నృత్యాలు చేస్తూ ఇంటింటికీ తిరిగారు. ఆడబిడ్డలు నీరు పోసి పసుపు, కుంకుమతో పూజలు చేశారు. అనంతరం కప్పను సమీప వాగులో వదిలి పెట్టారు. కప్ప ఎటువైపు వెళ్తుందో అటు నుంచి వర్షాలు కురుస్తాయని గిరిజనుల నమ్మకం.