కల నెరవేరింది. వారిలో ఆనందం వెల్లువిరుస్తున్నది. మండల కేంద్రంలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి గొడిసె ర్యాల గోండు గూడెం (జీ) ఎక్స్ రోడ్డు వరకు 10.35 కిలోమీటర్లు ఉన్న మట్టి రోడ్డుతో ఆయా గ్రామ ప్రజలు రాకపోకలకు నానా ఇబ్బందులు పడ్డారు. రూ. 602.93 లక్షలతో ప్రస్తుతం బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సర్కారు వల్లే రవాణా కష్టాలు
తీరాయని పేర్కొంటున్నారు.
దస్తురాబాద్, మే 29 : మారుమూల గ్రామాల్లో రోడ్ల నిర్మాణంపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో ఏ గ్రామానికి వెళ్లినా మట్టి రోడ్లు అధ్వానంగా ఉండేవి. ప్రజలు రాకపోకలకు నరకయాతన పడేవారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని సీఎం కేసీఆర్ రహదారుల అభివృధ్ధికి శ్రీకారం చుట్టా రు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి వయా భూత్కూర్, మున్యాల గొడిసెర్యాల గ్రామాల మీదుగా గొడిసెర్యాల గోండు గూడెం (జీ) ఎక్స్ రోడ్డు వరకు 10.35 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు సర్కారు నిధులు మంజూరు చేసింది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద బీటీ రోడ్డు 8.56 కిలో మీటర్ల నిర్మాణం, 1790 మీటర్ల్ల సీసీ రోడ్డు నిర్మాణం కోసం 602.93 లక్షలు మంజూరు చేసింది.ప్రస్తుతం సీసీ రోడ్డు, బీటీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2018 ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన సమయంలో భూత్కూర్ రోడ్డు పరిస్థితిని గ్రామస్తులు, నాయకులు రేఖా నాయక్ దృష్టికి తీసుకొచ్చారు. ఆమె సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ సానూకులంగా స్పందించి నిధులను కేటాయించారు. రోడ్డు పనులు పూర్తవడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
ఏండ్ల నాటి రోడ్డు సమస్య తీరింది. గిరిజనుల కల నెరవేరింది. రవాణా సౌకర్యం మెరుగుపడింది. రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. గుంతలతో నానా యాతన పడ్డాం. గత పాలకులకు గిరిజన గూడేలకు రోడ్డు వేయాలనే ఆలోచన లేకుండే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నిధులు మంజూరు చేయడం హర్షనీయం. బాధలు చూడలేక బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. – తొడసం కిరణ్ కుమార్, గ్రామస్తుడు, గొడిసెర్యాల గోండు గూడెం
గ్రామస్తుల ఎన్నో ఏండ్ల కోరిక నెరవేరింది. గతంలో ప్రజాప్రతినిధులకు,అధికారులకు రోడ్డు సమస్యపై పలు మార్లు విన్నవించుకున్నాం. కానీ బీటీ రోడ్డుకు మోక్షం రాలేదు.ప్రజలు,మేము సైతం రాకపోకలకు నానా ఇబ్బందులు పడ్డాం.కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డక దశల వారీగా గ్రామీణ ప్రాంత అభివృధ్ధికి సీఎం కేసీఆర్ కృషి చేసుకుంటూ వస్తున్నారు.రోడ్డు సౌకర్యాం కల్పించాలనే ఉద్దేశంతో 602.93 లక్షలు మంజూరు చేశారు.బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో రవాణా సౌకర్యం మెరుగుపడింది.ప్రజల తరుపున సీఏం కేసీఆర్కు, ఎమ్మెల్యే రేఖానాయక్ కు కృతజ్ఞతలు.
– సింగరి కిషన్, ఎంపీపీ, దస్తురాబాద్