కోటపల్లి, మే 29 : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కోటపల్లి పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ అభిల్ మహాజన్, జైపూర్ ఏసీపీ నరేందర్‌తో కలిసి సీపీ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌తో పాటు పరిసరాలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు.
సరిహద్దు గ్రామాల వివరాలు, ప్రస్తుత పరిస్థితులను చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, కోటపల్లి ఎస్ఐ వెంకట్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ప్రాణహిత నది ప్రవాహం తక్కువగా ఉన్నందున సరిహద్దులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పక్క రాష్ట్రం నుంచి అసాంఘిక శక్తులు మన రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఉందని, గ్రామాల్లో అనుమానంగా ఎవరు సంచరించినా, కొత్త వ్యక్తులు కనిపించినా సమాచారం ఇవ్వాలని సూచించారు.
సీసీ కెమెరాల ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయాలని, గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పోలీస్‌లు ప్రజలకు మరింత దగ్గర కావాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వెలువరుస్తున్న నోటిఫికేషన్లను గ్రామ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కష్టపడి చదివి మంచి కొలువు సాధించాలని ఆకాంక్షించారు. కోటపల్లిలో పోలీస్‌స్టేషన్ నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, కోటపల్లి ఎస్ఐ వెంకట్, ఎస్ఐ రవి కుమార్, సిబ్బంది ఉన్నారు.
వేమనపల్లి, మే 29 : ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత అని, పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. వేమనపల్లి మండలంలోని నీల్వాయి పోలీస్‌స్టేషన్‌ను మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆదివారం తనిఖీ చేశారు. సీపీకి పోలీసులు గౌరవ వందనం చేశారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్, స్టేషన్ రైటర్, క్రైం రైటర్, ఎస్‌హెచ్‌వో వర్టికల్స్ పనితీరు, పెండింగ్ కేసుల ఫైల్స్‌ను తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ఉండాలని సూచించారు. డయల్ 100 ఫిర్యాదులతో వేగంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలని, పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరంగా నిర్వహించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం నీల్వా యి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రాణహిత పరీవాహక ప్రాంతంలో ని ఫెర్రీ పాయింట్లను పరిశీలించారు. మావోయిస్టు ప్రభావిత గ్రా మాల వివరాలు, అటవీ ప్రాంతం పరిస్థితి, ప్రజల జీవన స్థితిగతులు, పడవలు నడిపే వారి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రాణహిత నది అవతల మహారాష్ట్రలో మావోయిస్టుల ప్రభావం ఉన్నందున ఎవరైనా అనుమానితులు పడవల్లో ఇటు వైపు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
అసాంఘిక శక్తులకు ఎవరూ సహకరించవద్దని కోరారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే పోలీసులకు తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సీపీ వెంట జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, నీల్వాయి ఎస్ఐ నరేశ్, సీఆర్పీఎఫ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.