కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ వెనుకబడ్డ ప్రాంతంగా పేరున్న ఆసిఫాబాద్.. స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత అనూహ్యంగా అభివృద్ధి బాట పట్టి ఆదర్శంగా నిలుస్తున్నది. కలెక్టరేట్, పోలీస్ కార్యాలయ భవనాలు పూర్తికావస్తుండగా, త్వరలో ప్రారంభించే అవకాశమున్నది. మంచిర్యాల-చంద్రపూర్ రహదారి-1ను ఫోర్‌లేన్‌గా విస్తరించి జాతీయ రహదారిగా మారుస్తుండగా, పట్టణ రూపురేఖలు మారిపోతున్నాయి. జూబ్లీ మార్కెట్, డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్ వంటి వాటితో సరికొత్త శోభ సంతరించుకున్నది. ఇక ఇటీవల ఏర్పాటు చేసిన థియేటర్ స్థానికులకు వినోదం అందిస్తుండగా, చిల్డ్రన్ పార్క్ ఆహ్లాదం పంచుతున్నది.
అభివృద్ధిలో వెనుకబడ్డ ప్రాంతంగా పేరున్న ఆసిఫాబాద్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రగతి పథంలో
దూసుకెళ్తున్నది. 2016లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సర్కారు ఈ ప్రాంత
అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నది. జిల్లా ఏర్పాటైన కొత్తలోనే ఇక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటి కలెక్టర్ చంపాలాల్ నివేదికలు అందజేసిన విషయం విదితమే. రాష్ట్రంలో గ్రామ పంచాయతీగా ఉండి జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న ఏకైక పట్టణం ఆసిఫాబాద్. ఇక్కడ వాణిజ్య పరమైన, విద్య, వైద్యం, వినోదంవంటి వసతులు లేకపోవడంతో ఇక్కడికి వచ్చేందుకు ఉద్యోగులు సైతం వెనుకంజ వేస్తుంటారు. ఈ పరిస్థితి నుంచి మార్పు తెచ్చేందుకు ప్రస్తుత కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
– ఆసిఫాబాద్, మే 29
మంచిర్యాల నుంచి చంద్రపూర్ వరకు ఉన్న రాష్ట్ర రహదారి-1ని ఫోర్‌లేన్‌గా విస్తరించి జాతీయ రహదారిగా
మారుస్తున్నారు. ప్రస్తుతం హైవే రోడ్డు పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ హైవే నిర్మాణంతో ఆసిఫాబాద్ పట్టణ రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి. ఆసిఫాబాద్ పట్టణంలోని పెద్దవాగు బ్రిడ్జి మీదుగా చెక్‌పోస్టు కాలనీ వెనుక నుంచి జన్కాపూర్ వైపు బైపాస్ రోడ్డు నిర్మించనుండడంతో వ్యాపార, వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు మంచి అవకాశం.
రాష్ట్రంలో రూర్బన్ పథకం కింద ఆసిఫాబాద్ సమీపంలోని చిర్రకుంట క్లస్టర్ కూడా ఎంపిక కావడంతో కేంద్ర ప్రభుత్వంనుంచి రూ. 30 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో ఇప్పటికే చిర్రకుంట నుంచి ఆసిఫాబాద్ వరకు డబుల్ రోడ్డు పనులు చేపట్టారు. దీంతో పాటు జిల్లా కేంద్రంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుంచి కుమ్రం భీం చౌక్ వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్లను ఏర్పాటు చేయడంతో కొత్త శోభ వచ్చింది. రూ. 40 లక్షలతో సెంట్రల్ లైటింగ్, రూ. 50 లక్షలతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు.
జిల్లా కేంద్రంలోని మార్కెట్ అస్తవ్యస్తంగా ఉండగా, సకల సౌకర్యాలతో ఉన్నతీకరించారు. రూ. కోటికి పైగా రూర్బన్ నిధులతో జూబ్లీ మార్కెట్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే మాంసం దుకాణాలను ఏర్పాటు చేశారు. రూ. 12 లక్షలతో ఫిష్ రూం, రూ. 10 లక్షలతో స్లాటర్‌హౌస్, రూ. 10లక్షలతో మరుగుదొడ్లు నిర్మించారు. రూ. కోటితో కూరగాయల మార్కెట్‌ను ఉన్నతీకరించారు.
జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్క గ్రామాల ప్రజలు సినిమా చూసేందుకు మంచిర్యాల, కాగజ్‌నగర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో జిల్లా మహిళా సమాఖ్య, పిక్చర్టైం ఆధ్వర్యంలో జన్కాపూర్‌లో రూ. 50 లక్షలతో సయుక్తంగా థియేటర్‌ను ఏర్పాటు చేసి వినోదం పంచుతున్నారు. దీంతో పాటు రూ. 1.30 కోట్లతో చిల్డ్రన్ పార్కు ఏర్పాటు చేయగా స్థానికులకు ఆహ్లాదం పంచుతున్నది.

పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా కేంద్రంలో 15 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం మేర పనులు పూర్తి కావచ్చాయి. కలెక్టరేట్ భవనానికి ఎదురుగా రూ. 52 కోట్లతో హరిత హోటల్ నిర్మాణం చేపడుతున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం పనులు కూడా 90 శాతం పూర్తయ్యాయి. మరోవైపు కుమ్రం భీం ప్రాజెక్టు వద్ద బోటింగ్ ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా కేంద్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే జూబ్లీ మార్కెట్‌ను ఉన్నతీ కరించాం. సెంట్రల్ లైటింగ్, చిల్డ్రన్ పార్కు, వాకింగ్ ట్రాక్, సినిమా థియేటర్‌ను ఏర్పాటు చేయించాం. రూర్బన్ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నాం. పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాలు పూర్తి కావస్తున్నాయి. కుమ్రం భీం ప్రాజెక్టు వద్ద బోటింగ్ ఏర్పాటు చేస్తాం.
– కోవ లక్ష్మి, జడ్పీ చైర్పర్సన్, ఆసిఫాబాద్
స్వరాష్ట్రంలో జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే పట్టణంలో అనేక ప్రగతి సాధించాం. గతంతో పోలిస్తే చాలా నిధులు కేటాయించి పనులు చేపట్టాం. జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తున్నాం.
– ఆత్రం సక్కు, ఎమ్మెల్యే, ఆసిఫాబాద్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్‌ను కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పాటు చేశారు.అప్పటి నుంచి కోట్లాది నిధులు మంజూరు చేస్తున్నారు. గతం తో పోలిస్తే పట్టణం చాలా అభివృద్ధి చెందింది. తెలంగాణ రాకముందు ప్రధాన మార్కెట్లో రోడ్డు కూడా లేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయం.
– వైరగర్రె ప్రతాప్, ఆసిఫాబాద్
తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసిఫాబాద్ ఎంతో అభివృద్ధి చెందిం ది. గతంలో డివిజన్ కేంద్రంగా ఉన్నప్పటికీ అభివృద్ధిలో వెనుకంజలో ఉండేది. కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పవచ్చు. కోట్లాది నిధులు కేటాయిస్తున్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు జిల్లా కేంద్రం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు.
– ఉబేద్బిన్ యాహియా, ఆసిఫాబాద్