యైటింక్లయిన్ కాలనీ, మే 28 : సింగరేణి బొగ్గు కార్మికుల కష్ట సుఖాలు తెలిసిన మహనీయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అలాంటి ఆయనతోనే బొగ్గు గని కార్మికుల ఉద్యోగ భద్రతకు భరోసా అని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఆర్జీ-2 ఏరియాలోని వకీలుపల్లి గనిలో డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా వివిధ కార్మిక సంఘాల నుంచి యూనియన్‌లో చేరిన 60కి పైగా కార్మికులకు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని ఆరోపణలు చేస్తున్న జాతీయ సంఘాలు ఎవరి ద్వారా హక్కుల అమలు జరుగుతుందో తెలుసుకోవాలని హితవు పలికారు.
గతంలో ఈ జాతీయ సంఘాలు చంద్రబాబు అడుగులకు మడుగులొత్తి వారసత్వ ఉద్యోగాలను పొగొట్టడంతోపాటు గోల్డెన్ షేక్‌హ్యాండ్‌తో 22వేల మంది కార్మికులను ఇంటికి పంపింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆ కార్మిక కుటుంబాల ఉసురు తాకిందని, నేటికీ కార్మికుల ఆదరణను కోల్పోయి ఆచేతనకు చేరుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువతకు జీవననాడీ లాంటి సింగరేణిలో ప్రైవేటీకరణకు అజ్యంపోసి మనుగడను ప్రశ్నార్థకం చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు.
పదేపదే వేజ్ బోర్డు సంఘాలమని పేర్కొనే వారు కార్మికులకు ఒరగబెట్టిందేమిటో వివరించాలని డిమాండ్ చేశారు. 10వ వేజ్ బోర్డు పూర్తయి యేడాది నడుస్తున్న నూతన వేజ్ బోర్డుకు ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. ఈ సంఘాలు కేవలం ఉనికి కోసమే ఆసత్యపు ప్రచారాలు చేస్తూ కార్మికుల వద్ద మొసలికన్నీరు కారుస్తూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయే తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు.
ఇప్పటికైనా జాతీయ సంఘాలు కోల్ ఇండియా స్థాయిలో సాధించాల్సిన హక్కులను అమలుపరిచి కొంతలో కొంతనైనా కార్మికుల రుణం తీర్చుకోవాలని సూచించారు. కేవలం ఉనికి కోసం పాకులాడితే కార్మికులు నమ్మే పరిస్థితుల్లో లేరని, మరోసారి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. నాయకులు పిట్ సెక్రటరీ మల్లికార్జున్, బానాకర్, చంద్రయ్య, ముస్కుల అనిల్ రెడ్డి, బాబురావు, సిరిసెట్టి రాములు, ఆవుల రాములు, యశ్వంత్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, మహేందర్, సత్యనారాయణ పాల్గొన్నారు.