భైంసాటౌన్, మే 28: గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొస్తున్నదని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మండలంలోని వానల్‌పాడ్‌లో క్రీడా మైదానాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. క్రీడా మైదానాలు భావితరాలకు బంగారుబాట వేస్తాయన్నారు. జూన్ 2న మండలంలో ఐదు క్రీడా మైదానాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఉపాధి హామీ నిధులతో కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో కోర్టుల ఏర్పాటుతో పాటు క్రీడా ప్రాంగణం చుట్టూ నీడనిచ్చే మొ క్కలు నాటుతామన్నారు.
అనంతరం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం సేకరణపై ఆరా తీశారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాంలకు తరలించాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎంపీడీవో గంగాధర్, ఎంపీవో మోజామ్ హుస్సేన్, ఏపీవో శివలింగం, సర్పంచ్ మాన్కుర్ పెద్ద రాజన్న, ఉప సర్పంచ్ దగ్డే ఈశ్వర్, టీఆర్ఎస్ నాయకులు గణేశ్ పాటిల్, సచిన్ పాటిల్, రాంకుమార్, పంచాయతీ కార్యదర్శి పాండురంగ్ ఉన్నారు.
భైంసా, మే 28 : పట్టణంలోని ఓవైసీ నగర్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సర్వేను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ శనివారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వే నిర్వహించాలని సూచించారు. అనధికారికంగా నిర్మించిన భవనాలు, కొలతల వివరాలు సేకరించి ఆన్లైన్ యాప్‌లో పొందుపర్చాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్ ఆర్డీవో తుకారాం, భైంసా తహసీల్దార్ సూర్యప్రకాశ్, సిబ్బంది ఉన్నారు.
కుభీర్, మే 28 : సర్కారు స్థలాల్లోని నివాసాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. కుభీర్‌లోని బీసీ కాలనీలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సర్వేను శనివారం పరిశీలించారు.
స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు 78 మంది దరఖాస్తు చేసుకున్నారని, పరిశీలించి నివేదికలు పంపాలని టీం లీడర్ జిల్లా ఇండస్ట్రీస్ ఏడీ నర్సింహారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ముత్యంను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, తహసీల్దార్ బత్తుల విశ్వంభర్, కుభీర్ సర్పంచ్ మీరా విజయ్‌కుమార్ ఉన్నారు.