మంచిర్యాల టౌన్, మే 26 : పిల్లలు, యువత శారీరక ధారుడ్యం, మానసికోల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా పట్టణాల్లోని ప్రతి వార్డులో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇటీవల నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి సమావేశాల్లో ఆదేశాలు కూడా జారీ చేశారు. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మంచిర్యాల మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా.. ఎకరం స్థలం అందుబాటులో ఉన్న నాలుగు వార్డుల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఐదు వేల క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కార్పొరేషన్లలో డివిజన్‌కు రెండు, జీహెచ్ఎంసీలో మూడు చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మున్సిపాలిటీల్లో వార్డు కొకటి చొప్పున ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. అయితే అన్ని వార్డుల్లో స్థలం అందుబాటులో ఉండడం సాధ్యపడే విషయం కాదు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టి నడుచుకోవాలని సూచించింది. ఇందుకోసం పట్టణ ప్రగతి నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించాలని, క్రీడలకు అధిక ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
మంచిర్యాల మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. ఇందులో మొదటి విడుతగా నాలుగు వార్డుల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను(టీకేపీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎకరం స్థలాన్ని ఉపయోగిస్తున్నారు. పట్టణంలోని హైటెక్కాలనీ (వార్డు నంబర్ 29), సాయికుంట (వార్డు నంబర్ 5), శ్రీలక్ష్మి నగర్ (వార్డు నంబర్ 9), రాజీవ్‌నగర్ (వార్డు నంబర్ 1)లో టీకేపీలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి వీటిని పూర్తి చేయాలని పనులను వేగవంతం చేశారు.
ప్రతి క్రీడా ప్రాగణంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్టు, లాంగ్‌జంప్ పిట్, పారలాల్ ఎక్సర్సైజ్ బార్, సింగిల్ ఎక్సర్సైజ్ బార్, గ్రౌండ్ లెవలింగ్, జంగిల్ క్లీనింగ్, ఎంఎస్ గేట్ ఆర్చ్‌లు ఉంటాయి. వార్డుల్లోని పిల్లలు, యువకులు, మహిళలు రోజు ఈ క్రీడా ప్రాంగణాలకు వెళ్లి వ్యాయామం చేసుకునేందుకు వీలుగా నివాస ప్రాంతాలకు సమీపంలోనే, అదే వార్డులో ఈ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎక్కువ మంది ప్రాంగణాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.