ఖానాపూర్ రూరల్, మే 26 : గ్రామాల్లో పరిపాలన సజావుగా సాగేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జీపీలను ఏర్పాటు చేశారు. చిన్నచిన్న తండాలన్నీ కలిపి గ్రామ పంచాయతీలుగా రూపొందించారు. వీటి అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయిస్తున్నారు. దశాబ్దాల పాటు వెలుగు చూడని గ్రామాలు ఇప్పుడు స్వరాష్ట్రంలో అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి. మూడేళ్ల క్రితం కొత్త గ్రామపంచాయతీలుగా ఆవిర్భవించిన గ్రామాలు.. ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయి. అభివృద్ధిలో పట్టణాలతో పోటీపడుతున్నాయి. గ్రామాల్లో పల్లె ప్రగతి నిధులతో నిర్మించిన భవనాలతో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయి. ఖానాపూర్ మండలంలో నూతనంగా ఏర్పడిన పంచాయతీలతో కలిసి మొత్తం 24 జీపీలున్నాయి.
గ్రామాల విభజన చెందిన అనంతరం అభివృద్ధికి ప్రాధాన్యత పెరిగింది. దీంతో భారీగా నిధులు కేటాయించారు. ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ చొరవతో గ్రామాలన్నీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఖానాపూర్ మండలంలో నూతన గ్రామ పంచాయతీలకు నాలుగు భవనాలు మంజూరయ్యాయి. మిగతా గ్రామాలకు సైతం నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రతిపాదనలు పంపారు.
ఖానాపూర్ మండలంలో దిలావర్పూర్కు రూ.16 లక్షలు, సోమార్పేట్కు రూ.16 లక్షల చొప్పున మంజూరయ్యాయి. ఈ నిధులు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) ద్వారా విడుదలయ్యాయి. గొసంపల్లెలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ((ఆర్జీఎస్ఏ) నుంచి రూ.20 లక్షలు మంజూరయ్యాయి.
ఈ గ్రామాలు నూతన భవనాలు పూర్తి చేసుకొని పరిపాలనను కొనసాగిస్తున్నాయి. సత్తనపల్లి గ్రామ పంచాయతీ నుంచి విభజన చెంది సేవ్యానాయక్తండా నూతన గ్రామపంచాయతీగా ఏర్పడింది. ఈ పంచాయతీకి రూ.20 లక్షలు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ నుంచి వెచ్చించారు. రేపోమాపో నిర్మాణ పనులు కూడా చేపట్టనున్నారు.
గతంలో గ్రామ పంచాయతీకి సొంత భవనం లేదు. రెండు నెలల క్రితం మా గ్రామపంచాయతీ కూడా పాఠశాలలో ఉండేది. అందులోనే గ్రామసభలు నిర్వహించేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నూతన గ్రామ పంచాయతీల్లో భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. సొంత భవనంలో విశాలమైన మీటింగ్ చాంబర్, సర్పంచ్, కార్యదర్శి గదులు నిర్మించారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు.
– బోడిగే సంతోష్, గొసంపల్లె గ్రామస్తుడు
నూతన గ్రామ పంచాయతీ భవనానికి నిధులు మంజూరయ్యాయి. కానీ నిర్మించేందుకు స్థలం లేదు. సేవ్యానాయక్ తండా నూతన గ్రామ పంచాయతీగా ఆవిర్భవించి మూడేండ్లు అయ్యింది. నూతన గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షలు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ నుంచి మంజూరయ్యాయి. స్థలం ఇవ్వడానికి దాతలు ముందుకొస్తే పనులు ప్రారంభిస్తాం.
– సాయికృష్ణ, సేవ్యనాయక్తండా కార్యదర్శి