చెరువు.. నీటితో కళకళలాడుతుంటే.. ఊరికే అందం. జలాలు పారుతుంటే లాభసాటిగా పంటలు.., పచ్చదనం పరుచుకునే భూములు.., పశువులకు సమృద్ధిగా తాగునీరు.., కుల వృత్తులకు ఉపాధి.., గ్రామంలో భూగర్భ జలాల వృద్ధి. అదీ ఎర్రటెండ.., మే నెలలోనూ నిండుకుండలా ఉంటే ఆహా.. వినడానికే ఎంతో బాగుంది కదూ..! కుభీర్ మండలం చాత గ్రామ శివారులోని ‘సత్యం’ చెరువు నీటితో సజీవంగా కనిపిస్తున్నది. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయతో ఈ చెరువుకు మహర్దశ పట్టింది. రూ.55 లక్షలతో మరమ్మతులు చేయగా, ఏడాది పొడవునా సమృద్ధిగా నీరు నిల్వ ఉంటున్నది. మొత్తంగా చెరువే ఊరికి జీవనాధారం అన్నది నిజమవుతున్నది.
– కుభీర్, మే 22
కుభీర్ మండలం చాత గ్రామ శివారులోని ‘సత్యం’ చెరువు ఆయకట్టు కింద రైతులు వరితో పాటు ఇతర వాణిజ్య పంటలు సాగు చేస్తున్నా రు. మరమ్మతుల తర్వాత చెరువులో ఎడాది పొడవునా నీరు ఉంటున్నదని పలువురు రైతు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా బోరుబావుల్లో పుష్కలంగా భూగర్భ జలాలు పెరిగాయి. అలాగే చెరువు గట్టున గౌడ కులస్తులు ఈత మొక్కలు నాటుకోవడంతో ఏపుగా పెరిగాయి.
నీరు నిల్వ ఉండడంతో మత్స్యకారులు చేపలు పెంచుకుంటూ ఉపాధి పొందుతున్నారు. భూ గర్భ జలాలు పెరగడంతో యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం అమాంతం పెరిగిపోయింది. ఈ యేడు మండలంలో మక్క రికార్డు స్థాయిలో పండించి, ఆర్థికంగా రైతులు బలోపేతం అవుతున్నారు. బీళ్లన్నీ పచ్చని పంట పొలాలతో కనువిందు చేస్తున్నాయి. పలువురు రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పశువులను సాకుతూ ఉపాధి పొందుతున్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెరువుల మరమ్మతులకు మోక్షం కలిగింది. మా చెరువు కూడా అందులో బాగైంది. రూ.55 లక్షలతో కట్ట పెంపు, అలుగు మరమ్మతు, కొంత మేర సీసీ కాల్వల నిర్మాణం జరిగింది. దీంతో చెరువులో పుష్కలంగా నీరు నిల్వ ఉంటున్నది. బోరు బావుల్లో ఫుల్ నీటి మట్టం పెరగడంతో యాసంగిలో రైతులందరూ మక్క సాగు చేసి, ఆదర్శంగా నిలుస్తున్నారు. బహుశా మేము పండించినన్ని మక్కలు మండలంలో ఏ గ్రామంలోనూ పండించలేదు. ఇదంతా చెరువు వల్లనే.
– సిందే అనిల్ పటేల్, సర్పంచ్, చాత
కుల వృత్తుల వారికి పని దొరుకుతున్నది. గొర్లు, మేకల పెంపకం దార్లకు వాటిని మేపేందుకు, సేద తీర్చేందుకు, మండు టెండల్లోనూ మూగజీవులకు పుష్కలంగా తాగునీరు ఉంది. నా ఎకరం భూమి చెరువు కింద ఉంది. నేను వరి వేస్తాను. బోరు బావుల్లోనూ నీటి మట్టం పెరగడంతో అందరూ యాసంగిలో పంటలు వేసి, లాభాలు పొందుతున్నారు. నేను రోజు గొర్లు, మేకలను మేపడంతో పాటు నీళ్లు తాగించి, ఎండ దిగిందాక చెట్ల కిందనే ఉంచుతా. చెరువు ఎంత సౌకర్యంగా మారిందో చూడండి.
– కాలేవార్ భోజన్న, గొర్రెల యజమాని, చాత