అంగన్వాడీ సేవలు పారదర్శకంగా ఉండడంతోపాటు చిన్నారుల ఆరోగ్య సమాచారం అరచేతిలో ఉండేలా ప్రభుత్వం పోషణ్ ట్రాకర్కు శ్రీకారం చుట్టింది. ఇందుకు ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఇందులో ప్రతినెలా బాలింతలు, గర్భిణులు, ఆరేళ్లలోపు చిన్నారులకు అందించే పౌష్టికాహారం, శారీరక ఎదుగుదల వంటి వివరాలు సేకరించి నమోదు చేస్తారు. పోషణ్ ట్రాకర్ యాప్లో వివరాల నమోదుపై అవగాహన కల్పించారు.
– నిర్మల్ చైన్గేట్, మే 23
అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని టీచర్లు గృహసందర్శనలో భాగంగా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. ప్రతినెలా లబ్ధిదారుల కుటుంబాలకు చెందిన చిన్నారుల వివరాలు నమోదు చేస్తారు. చిన్నారుల వయస్సు, ఎత్తు, బరువు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్య వివరాలు ఈ యాప్లో నమోదు చేస్తారు. అతి తక్కువ బరువు ఉండటానికి గల కారణాలు, పోషణ లోపాలు, ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటారు. ఈ యాప్లో వివరాలు నమోదు చేయడం ద్వారా తగిన ఆరోగ్య సలహాలు, జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కాగా.. లబ్ధిదారుల వివరాలు యాప్లో నమోదు చేయడానికి కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ నుంచి ప్రతినెలా టీచర్లకు రూ.500, ఆయాలకు రూ.250 చెల్లిస్తారు.
అంగన్వాడీ కేంద్రాలలో లబ్ధిదారులకు మెరుగైన పోషకాహారం అందించడంతోపాటు వైద్యసేవలు పొందేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. డిజిటలీకరణలో భాగంగా రూపొందించిన ఈ పోషణ్ ట్రాకర్ యాప్లో పారదర్శకంగా వివరాలు నమోదు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. అతి తక్కువ బరువు, పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యాప్లో వివరాల నమోదుపై జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, సిబ్బందికి అవగాహన కల్పించాం.
– విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారిణి, నిర్మల్
అంగన్వాడీ కేంద్రాలు 816
మినీ అంగన్వాడీలు 110
ఆరేళ్లలోపు చిన్నారులు 63,201
గర్భిణులు 6,306
బాలింతలు 6,682