కడెం, ఏప్రిల్ 16 : ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులందరూ తప్పనిసరిగా పరీక్షలు రాసేలా చూడాలని నిర్మల్ జిల్లా విద్యాధికారి రవీందర్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. కడెం మండలం అంబారిపేటలోని జడ్పీ పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఎస్ఏ-2 పరీక్షలు ప్రారంభం కావడంతో అంబారిపేట స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని కల్లెడ, నవాబ్‌పేట, లక్ష్మీపూర్, అంబారిపేట, పాండ్వాపూర్ పాఠశాలలను ఆయన సందర్శించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించగా, ఏడు నుంచి పదో తరగతి విద్యార్ధులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు పరీక్షలు నిర్వహించాలన్నారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు తాగునీరు, ఇతర సౌకర్యాలు అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట అంబారిపేట జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రేమ్‌దాస్, ఉపాధ్యాయులు షేక్ ఇమ్రాన్, దయారం, మురళీ, మధురి, సత్యభామ ఉన్నారు.