కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యాటకంగా రూపుదిద్దుకుంటున్నది. జిల్లాలోని ప్రతి మండలం ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. ‘నో యువర్ డిస్ట్రిక్ట్-ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్’లో భాగంగా తయారు చేసిన నివేదికలోని అంశాలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయి. గతంలోనే పర్యాటక ప్రాంతాలను గుర్తించిన అధికారులు వాటి అభివృద్ధికి రూ.36.50 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.
సర్కారు కల్పించనున్న వసతులతో జిల్లా పర్యాటకంగా, ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా మారనుంది. ఇటీవల కుమ్రం భీం ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ రాహుల్‌రాజ్, బోటింగ్ ఏర్పాటు చేయాలని పర్యాటకశాఖను ఆదేశించారు. ఇప్పటికే మహిళా సంఘాల ఆధ్వర్యంలో మినీ సినిమా టాకీస్, పిల్లల పార్క్ అందుబాటులోకి వచ్చాయి.
జిల్లాలోనే అతిపెద్ద జలాశయమైన కుమ్రం భీం ప్రాజెక్టు వద్ద బోటింగ్, రిసార్టు, గార్డెన్ ఏర్పాట్లు చేసేందుకు ప్రత్యేక నివేదికలు రూపొందించారు. రహదారికి అనుకొని ఉండడం, పెద్ద పెద్ద కొండల వల్ల పర్యాటక ప్రాంతంగా మారనుంది. తిర్యాణి మండలంలోని ఎన్టీఆర్ వద్ద పర్యాటకులను ఆకర్శించేందుకు నివేదికలు తయారు చేశారు. మోవాడ్లోని సమతల గుండం, లింగాపూర్ మండలం మిట్టె జలపాతాలు ఉన్నాయి.
జైనూర్లోని ఊషేగాం, కెరమెరిలోని కెస్లాపూర్ వద్ద చేతి వృత్తి కళాకారులు తయారు చేసే ఇత్తడి బొమ్మలు, గిరిజన దేవుళ్ల కళారూపాలను తయారు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వీటికి ప్రోత్సాహకాలను అందిస్తున్నది. బెజ్జూర్ మండలంలోని పావురాల గుట్ట, సిద్ధేశ్వర ఆలయాలు పర్యాటకంగా గుర్తింపు పొందాయి.
రెండు కొండలను అనుకొని ప్రవహించే వాగుపై కుమ్రం భీం ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను అనుకొని ఆదిలాబాద్-కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను కలిపే రహదారి ఉంది. ఈ ప్రాజెక్టును పర్యాటకంగా ఏర్పాట్లు చేస్తే జిల్లాకే మంచి గుర్తింపు రానుంది. ఏడాదిపాటు ప్రాజెక్టులో పుష్కలంగా నీరుంటుంది. ప్రాజెక్టు వద్ద బోటింగ్, రిసార్టులు, గార్డెన్ ఏర్పాటు చేస్తే పర్యాటకును విశేషంగా అకట్టుకునే ఆస్కారం ఉంది. జిల్లాలో మరో చెప్పుకోదగిన విశేషం లింగాపూర్ మండలంలోని మిట్టెజలపాతాలు.
ఏడుమిట్టెలు ఒకే చోట వరుగా ఉండడం ఇక్కడి విశేషం. ప్రతి సీజన్లోను ఇక్కడికి వందలాది మంది పర్యాటకులు వచ్చి మిట్టెల అందాలను తిలకిస్తారు. పర్యాటకంగా కొన్ని ఏర్పాట్లు కల్పిస్తే ఈ మారుమూల ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. బెజ్జూర్ మండలంలోని పావురాల గుట్ట రాబందులకు ప్రసిద్ధి. అంతరించిపోయే దశలో ఉన్న రాబందులు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తే ఎంతో సుందరంగా ఉంటుంది.