ఎదులాపురం, ఆగస్టు 13 ః ఎయిర్ పోర్ట్ భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అపోహలు, సందేహాలను నివృత్తి చేస్తూ అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రక్షణ శాఖ సంయుక్తంగా ఆమోదించిన నూతన మ్యాప్ ఆధారంగానే సర్వేలు, భూసేకరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.
గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో రూపొందించిన మ్యాప్‌కు ప్రస్తుతం పరిపాలనా ప్రాధాన్యం లేదని, ఎయిర్ పోర్ట్ అథారిటీ, రక్షణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆమోదించిన నూతన మ్యాప్‌కే అధికారిక గుర్తింపు ఉందని తెలిపారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవసరమైన 2009 ఎకరాల భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేసి భూమిని అప్పగించేలా అధికారులు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
రోడ్ల మళ్లింపు, విద్యుత్ లైన్ల తొలగింపు, సాగునీటి కాలువల మార్పు పనులకు సంబంధించి అవసరమైన పరిపాలన అనుమతులు జారీ అయ్యాయని తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల సందేహాలను అధికారులు పూర్తి వివరాలతో నివృత్తి చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో ఒకే విధమైన స్పష్టమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్ఎస్ చిత్రు, రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్ రావు, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.