జైనథ్, సెప్టెంబర్ 2 : ఆదిలాబాద్ జిల్లావాసులు గణేశ్ నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం భోరజ్ మండలంలోని డొల్లార వద్ద గల పెన్‌గంగ నదిలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రేన్లు, గజ ఈతగాళ్లు, రెవెన్యూ, విద్యుత్ అధికారులను షిఫ్టులవారీగా నియమించాలన్నారు. వీరి వెంట డీఎస్పీ జీవన్‌కుమార్, ఆర్డీవో స్రవంతి, తహసీల్దార్ రాజేశ్వరి, ఎస్సై గౌతం నాయక్ ఉన్నారు.
ఎదులాపురం, సెప్టెంబర్ 2 : గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేలా పూర్తి ఏర్పాట్లు చేశామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని శోభాయాత్ర జరిగే రూట్‌తోపాటు సమస్యాత్మక ప్రాంతాలను ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం.. డీజేలు, లెజర్ లైట్లకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, చీఫ్ ఇంజినీర్, విద్యుత్ శాఖ ఎస్ఈ జేఆర్ చౌహన్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, హిందూ సమాజ్ సమితి అధ్యక్షుడు హన్మండ్లు, రాళ్లబండి మహేందర్ పాల్గొన్నారు.