
ఉమ్మడి జిల్లాకురూ.32.11 కోట్లు విడుదల
జిల్లా పంచాయతీ అధికారుల ఖాతాల్లో డబ్బుల జమ
జోరందుకోనున్న అభివృద్ధి పనులు
నిర్మల్ టౌన్, మార్చి 30 : పల్లె ప్రగతికి ప్రాధాన్యమిస్తున్న ప్రభు త్వం.. ప్రగతిలో భాగంగా అభివృద్ధి పనులకు నిధులను విడుదల చేస్తున్నది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ప్రతినెలా గ్రామపంచాయతీలకు నిధులను మంజూరు చేస్తున్నది. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు మార్చికి సంబంధించి రాష్ట్ర నిధుల కింద సుమారు రూ.32.11 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమ్మడి జిల్లాకు రూ.32.11 కోట్లు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్‌లో 396, ఆదిలాబాద్‌లో 465, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 334, మంచిర్యాల జిల్లా లో 311 గ్రామ పంచాయతీలున్నాయి. వీటికితోడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జడ్పీలు, 65 మండల ప్రజా పరిషత్‌లున్నాయి. వీటికి నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిర్మల్ జిల్లాలో 396 జీపీలుండగా.. ఇందులో జడ్పీకి రూ.27.07లక్షలు, మండల పరిషత్‌లకు రూ.54.14 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.7.27 కోట్ల నిధులను విడుదల చేశారు. మొత్తంగా రూ.8.08 కోట్లు విడుదలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 465 గ్రామ పంచాయతీలున్నాయి. జడ్పీలకు రూ.31.44 లక్షలు, మండల ప్రజా పరిషత్‌లకు రూ.62.58 లక్షలు, జీపీలకు రూ.84.45 లక్షలు కలిపి మొత్తంగా రూ.9.38 కోట్లు విడుదలయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 334జీపీలున్నాయి. ఇందులో జడ్పీకి రూ.25.03 లక్షలు, మండల ప్రజా పరిషత్‌లకు రూ.50.07 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.6.72 కోట్లు కలిపి మొత్తం రూ.7.48 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 311 జీపీలున్నాయి. ఇందులో జడ్పీకి రూ.24.16 లక్షలు, మండల పరిషత్‌లకు రూ.48.31 లక్షలు, జీపీలకు రూ.6.49 కోట్లు కలిపి మొత్తం రూ.7.20 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులన్నీ ఆయా జిల్లాల పంచాయతీ అధికారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
అభివృద్ధి పనుల జోరు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతినెలా నిధులను విడుదల చేయడంతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లో పల్లె ప్రగతి ద్వారా ఇప్పటికే వైకుంఠధామాలు, ఇంకుడుగుంతలు, సెగ్రిగేషన్ షెడ్లు, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణంతో పాటు సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ప్రభుత్వం మార్చికి సంబంధించిన నిధులను విడుదల చేయడంతో ఆయా గ్రామాల్లో ఈ పనులన్నీ మరింత వేగం పుంజుకోనున్నాయి. త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.