
స్వచ్ఛందంగా ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్న జనం
నిర్మానుష్యంగా మారుతున్న వ్యాపార సముదాయాలు
పడిపోయిన ఆర్టీసీ ఆదాయం
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 24 : కరోనా కాటు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఎక్కడ పరీక్షలు నిర్వహించినా పాజిటివ్ కేసులే అధికంగా నమోదవుతున్నాయి. వారం రోజుల్లోనే వైరస్ విస్తరించి ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్న ఘటనలు కళ్లముందే కన్పిస్తున్నాయి. ఇంకేముంది.. ‘ఎక్కడికి వెళ్లవద్దు.. ఇంటి పట్టునే ఉందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం’ అంటూ జనం స్వచ్ఛందంగా ఇంటి పట్టుకే పరిమితమవుతున్నారు. గ్రామాలకు గ్రామాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తూ కట్టడితో కరోనాపై యుద్ధం ప్రకటిస్తున్నాయి.
నిర్మల్ జిల్లాలో ఇప్పటికే చాలా గ్రామాల్లో పగటిపూట లాక్డౌన్ ప్రకటించడంతో కర్ఫ్యూ వాతావరణం తలపిస్తున్నది. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు జనం లేక వెలవెలబోయి కన్పిస్తున్నాయి. ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి స్వచ్ఛంద నియంత్రణే కారణమని పదేపదే చెప్పడంతో గ్రామాల్లో చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్పా బయటకు రావడం లేదు. వచ్చిన వారు సైతం మాస్క్లు, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ వాడుతూ పని ముగియగానే ఇంటికి వెళ్లిపోతున్నారు. సాయంత్రం ఐదు గంటలైతే చాలు.. పల్లెల్లో నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తున్నది.
జనం లేక వెలవెలబోతున్న బస్సులు, వ్యాపారాలు..
వారం రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం వ్యాపారాలపై స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో ప్రయాణం చేసేందుకు ప్రజలు సుముఖత చూపడం లేదు. దీంతో ఆర్టీసీకి గణనీయంగా ఆదాయం పడిపోయింది. గతంలో నిర్మల్ డిపో పరిధిలో రోజుకు రూ.7లక్షల వరకు ఆదాయం రాగా.. ఇప్పుడు రూ.2 లక్షలు కూడా దాటడం లేదని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధి కోసం ప్రైవేటు వాహనాలను రోడ్లపై తిప్పే యజమానులకు సైతం గిరాకీ లేకపోవడంతో ఇంటి పట్టునే తమ వాహనాలను నిలుపుకోవాల్సి వస్తున్నది. వ్యాపార దుకాణాలు, హోటళ్లు, చిరువ్యాపార దుకాణాదారులు కూడా జనం రాక, గిరాకీ లేక నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగాలు వస్తే చూపించుకునేందుకు కూడా జనం భయపడుతున్నారు. దవాఖానల్లో కొవిడ్ రోగులు తప్పా మిగతా సాధారణ జబ్బులకు సంబంధించిన వారు కనిపించడం లేదు. అసలే కరోనా కాలం కావడంతో ప్రయాణం చేయడం, దవాఖానకు వెళ్లి చికిత్సలు చేసుకోవాల్సి రావడంతో ఎక్కడి నుంచి ఏ ముప్పు వస్తుందోనని జంకుతున్నారు. దీంతో చిన్న చిన్న జబ్బులుంటే తాత్కాలికంగా ఇంట్లోనే గోలీలు వాడున్నారు.