
మత్తు ఇంజెక్షన్ ఇచ్చే ప్రయత్నం
మహారాష్ట్రలో ఘటన
తిప్పేశ్వర్ అభయారణ్యానికి తరలింపు
సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
భీంపూర్, ఏప్రిల్ 24 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పెన్‌గంగ పరీవాహక సరిహద్దు గ్రామాలకు సమీపంలో ఉన్న మహారాష్ట్ర గ్రామాల్లో పెద్దపులి భయం నెలకొన్నది. మహారాష్ట్రలోని గాటంజీ తాలూకా పార్వ సమీపంలోని పింప్రి గ్రామ శివారు చేనులో శుక్రవారం సాయంత్రం పెద్ద పులి ఒక చెట్టుకింద కూర్చొని ఉన్న విషయాన్ని రైతులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి బోను, మత్తు ఇంజెక్షన్లతో రాగా, సిబ్బందిపై పులి దాడిచేసి ఇద్దరిని గాయపరిచిందని స్థానికుడు నితిన్ పెంచల్వార్ చెప్పారు. తర్వాత రాత్రి వరకు అతికష్టం మీద పులిని సమీప తిప్పేశ్వర్ అభయారణ్యంలోకి తరలించారు. తిప్పేశ్వర్ నుంచి పులులు దాహం తీర్చుకునేందుకు పెన్‌గంగ వైపు వస్తాయని, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ విషయమై భీంపూర్ ఎఫ్‌బీవో కేశవ్‌ను వివరణ కోరగా.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పులి సంచారం లేదని, తాంసి(కే) అడవుల్లో యథావిధిగా సంరక్షణ చర్యలు కొనసాగిస్తున్నామన్నారు.
అగర్‌గూడలో కలకలం..
పెంచికల్పేట్, ఏప్రిల్ 24 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ పెద్దవాగు ప్రాంతంలో పెద్దపులి కలకలం రేపింది. మండలంలోని అగర్‌గూడకు చెందిన మహిళలు గ్రామ సమీపంలో గల పెద్దవాగుకు బట్టలు ఉతికేందుకు శనివారం వెళ్లారు. వారి సమీప ప్రాంతానికి పెద్దపులి వచ్చి గాం డ్రించింది. ఒక్కసారిగా వారంతా కేకలు వేయగా, చుట్టుపక్క ల వారందరూ పెద్దగా అరవడంతో అటవీ ప్రాంతంలోకి వె ళ్లింది. దీనిపై అటవీశాఖ అధికారులను వివరణ కోరగా.. పెద్దపులి సంచరించడం వాస్తవమేనని తెలిపారు. ఎండాకాలం కావడంతో దాహం తీర్చుకునేందుకు వాగు ప్రాంతానికి వస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.