నస్పూర్, అక్టోబర్ 28 : ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలోవిచారణ జరిపి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఆర్డీవోలు రాములు, హరికృష్ణ, డీఆర్డీవో కిషన్‌తో కలిసి ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మందమర్రి, బెల్లంపల్లి, జైపూర్, పెర్కపల్లి, హాజీపూర్, దండేపల్లి, మందమర్రి, కన్నెపల్లి మండలాల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు అందించారు.
కలెక్టరేట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుండగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. అదనపు కలెక్టర్ మోతీలాల్ ఎంత మంది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నమోదు చేసుకున్నారని అడిగారు. అక్కడున్న అధికారులు కేవలం ముగ్గురు మాత్రమే నమోదు చేసుకున్నామని తెలిపారు. అసలు ఎమ్మెల్సీ అనే వారు ఏ సభలో ఉంటారు, దాన్ని ఏమని పిలుస్తారని అదనపు కలెక్టర్ అడుగగా కొద్దిమంది అధికారులు మాత్రమే స్పందించారు. అన్ని డిపార్ట్మెంట్లలోని గ్రాడ్యుయేట్ ఉద్యోగులందరితో ఓటరు నమోదు చేయించాలని సూచించారు. అధికారులే నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని మండిపడ్డారు.