ఆయనో ఐఏఎస్ అధికారి. గ్రంథాలయాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ.. ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పడుతున్న గ్రామీణ యువతకు చేయూతనిస్తున్నారు. అన్ని రకాల పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావడమేగాక సకల సదుపాయాలు కల్పించి అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు. సర్కారు కొలువే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్న వారికి ‘అక్షర’సాయమందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.. మన మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్..
మంచిర్యాల, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే ఆశామాషీ కాదు. లక్షల మంది పోటీ పడితే వందల మందికే కొలువులు వస్తుంటా యి. అందుకోసం ఏళ్లకేళ్లు గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అలాంటి వారికి మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీ రాహుల్ అండగా నిలుస్తున్నారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులకు అన్నీ తానై నిలుస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ కుటుంబం నుంచి ఐఏఎస్ సాధించిన ఆయ న, తనలాంటి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నిరుద్యోగ యువతకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. స్వయంగా జిల్లా అదనపు కలెక్టర్ వచ్చి సదుపాయాలు కల్పిస్తుండగా, ఉద్యోగార్థులు రెట్టింపు ఉత్సాహంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.
ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలోనే అదనపు కలెక్టర్ రాహుల్‌కు జిల్లాలోని గ్రంథాలయాలకు పర్సన్ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో గ్రూప్స్ సహా డీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఉద్యోగార్థులకు ఇది అత్యంత కీలకమైన సమయమని గుర్తించిన ఆయన, అన్ని గ్రంథాలయాలను సందర్శించారు. జిల్లాలోని మూడు ప్రధాన లైబ్రరీల్లో గ్రూప్స్‌కు ప్రిపేరవుతున్న 250 మందిని, డీఎస్పీ ప్రిపేర్ అవుతున్న 150 మందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కష్టపడి చదువుతున్నా.. సరైన పద్ధతుల్లో ప్రిపేర్ కాలేకపోతున్నారని గుర్తించారు. ‘ఏళ్ల తరబడి చదివి పరీక్షల్లో చేస్తున్న తప్పులేమిటి.. ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారు.
ఇంకా బాగా స్కోర్ చేయాలంటే ఏం చేయాలి’ అనే అంశాలపై ఉద్యోగార్థులు దృష్టి పెట్టడం లేదని తెలుసుకున్నారు. అందుకోసం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఆన్లైన్ పరీక్షలు రాసే వెసలుబాటు కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రైవేటు ఇనిస్టిట్యూట్లతో సంప్రదింపులు చేశారు. ఈ క్రమంలోనే పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రముఖ ఇనిస్టిట్యూట్లు ముందుకు వచ్చాయి.

హైదరాబాద్ ఏఎస్కే ఇనిస్టిట్యూట్ గ్రూప్స్ చదువుతున్న వారికి, ఎస్అండ్ఎస్ ఇనిస్టిట్యూట్ డీఎస్సీకి ప్రిపేరవుతున్న వారికి ఉచితంగా టెస్ట్ సిరీస్(ఆన్లైన్ టెస్టులు) ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. ఈ మేరకు జిల్లాలోని 400 మంది ఉద్యోగార్థులకు ఆన్లైన్ లాగిన్స్ ఇచ్చిన సదరు ఇనిస్టిట్యూట్లు టెస్టు సిరీస్‌ను ప్రొవైడ్ చేస్తూ, ముఖ్యమైన అంశాలపై వీడియోలను సైతం అందజేస్తున్నాయి.
ఉద్యోగార్థుల కోరిక మేరకు లైబర్రీలకు అదనపు పుస్తకాలు తెప్పించారు. కలెక్టర్, జిల్లా అటవీశాఖ అధికారుల సహకారంతో పోటీ పరీక్షలకు సంబంధించి ప్రముఖ రచయితలు రాసిన పుస్తకాలను అందుబాటులోకి తేవడంతో పాటు మ్యాగజైన్లు, ఇంగ్లిష్ న్యూస్ పేపర్లను గ్రంథాలయాల్లో వేయిస్తున్నారు. ప్రతి పదిహేను రోజులకోసారి ఉద్యోగార్థులతో మాట్లాడి, వారికి కావాల్సిన పుస్తకాలను సమకూరుస్తూ వస్తున్నారు. పోటీ పరీక్షలు అయ్యే వరకు ఇది నిరంతర ప్రక్రియలా కొనసాగించాలని నిర్ణయించారు. ఇక పుస్తకాలతో పాటు ఇంటర్నెట్ సైట్స్లోనూ కావాల్సిన సబ్జెక్ట్‌ను చదువుకునేలా గ్రంథాలయాల్లో ఉచిత వై-ఫై సదుపాయం కల్పించారు.
దాన్ని ఎవ్వరూ మిస్ యూజ్ చేసి, సమయం వృథా చేసుకోకుండా కొన్ని సైట్లను బ్యాన్ చేశారు. మంచిర్యాల లైబ్రరీలో చదువుకుంటున్న వారి కోసం కలెక్టర్ సహకారంతో 100 స్టడీ చైయిర్స్ సమకూర్చారు. అలాగే ఉద్యోగార్థుల కోరిక మేరకు మంచిర్యాల గ్రంథాలయ టైమిగ్స్ సైతం పెంచారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇది తెరిచే ఉంటుంది. ఇక చెన్నూర్, బెల్లంపల్లి లైబ్రరీలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రభుత్వ సెలవు దినాల్లో మూసివేసే లైబ్రరీలను ఇప్పుడు సెలవు రోజుల్లోనూ ఉద్యోగార్థులే స్వయంగా తెరచుకునే వెసలుబాటు కల్పించారు.
తాండూర్ మండలం బోయపల్లి గ్రామంలోని ఉద్యోగార్థులు కొన్నేళ్లుగా ప్రేవేట్ భవనంలో చదువుకుంటున్నారని తెలుసుకున్న అదనపు కలెక్టర్.. బోయపల్లికి వెళ్లి వారిని కలిశారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే ఓ ప్రభుత్వ పాఠశాల భవనానికి చిన్న చిన్న రిపేర్లు చేయించి ఉద్యోగార్థులు చదువుకునేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని మూడు ప్రధాన లైబ్రరీలతో పాటు బోయపల్లి యువతకు అవసరమైన పుస్తకాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల సహకారంతో మంచిర్యాల జిల్లా గ్రంథాయలయం, చెన్నూర్, బెల్లంపల్లి గ్రంథాలయాల్లో 100 రోజుల పాటు ఉచిత భోజన సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్షంతో కష్టపడుతున్న వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాం. వారి కోసం ఏం కావాలన్నా చేస్తాం. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఉద్యోగం సాధిస్తే వారి కుటుంబాలు బాగుపడుతాయి. ఈ సంకల్పంతోనే ప్రభుత్వ గ్రంథాలయాల్లో చదువుకునే ఉద్యోగార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లోనూ ఇదే పద్ధతుల్లో ఉద్యోగార్థులకు మా సంపూర్ణ సహకారం అందిస్తాం.
– రాహుల్, మంచిర్యాల అదనపు కలెక్టర్